కరోనాను నయం చేస్తానని చెబుతూ ఓ ఆయుర్వేద వైద్యుడు సుప్రీం కోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశాడు. కరోనాను నయం చేయగలిగే మెడిసిన్‌ను తాను కనుగొన్నానని, దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పేషెంట్లకు ఇవ్వాలని అతను కోరాడు. అయితే కోర్టు అతని పిల్‌ను కొట్టి వేసింది. అంతేకాకుండా ఆ వైద్యుడికి కోర్టు రూ.10వేల జరిమానా కూడా విధించింది.
హర్యానాకు చెందిన ఓం ప్రకాష్ వేద్ గ్యాంతర బీఏఎంఎస్ చేశాడు. ఆయుర్వేద వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే కరోనాకు తాను మెడిసిన్‌ను తయారు చేశానని, దాంతో కరోనాను పూర్తిగా నయం చేయవచ్చని అతను సుప్రీం కోర్టులో పిల్ వేశాడు. దాన్ని శుక్రవారం విచారించిన కోర్టు కొట్టివేసింది. ఇలాంటి అర్థం పర్థం లేని పిల్స్‌ను వేయవద్దని, మెడిసిన్ నిజంగానే పనిచేస్తే అన్ని ఆధారాలతో రావాలని, అంతేకానీ ఇలాంటి వార్తలతో ప్రజలను మభ్యపెట్టకూడదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఓం ప్రకాష్ కు కోర్టు రూ.10వేలు ఫైన్ వేసింది.
కాగా గతంలో ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి గ్రూప్ కూడా కరోనిల్ పేరిట ఓ ఆయుర్వేద మెడిసిన్‌ను అందుబాటులోకి తేగా.. పలు వివాదాల కారణంగా ఆ మెడిసిన్ మార్కెట్‌లోకి రాకుండానే పోయింది. అయితే ఏ మెడిసిన్ అయినప్పటికీ శాస్త్రీయ పద్ధతిలో అన్ని ఆధారాలతో రుజువులు ఉంటేనే మార్కెట్‌లో అమ్మేందుకు వీలుంటుందని గతంలోనే కేంద్రం తెలిపింది. అందుకనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా కరోనిల్ మెడిసిన్‌కు ముందుగా అనుమతి ఇవ్వలేదు. తరువాత ఆ మెడిసిన్‌ను కరోనాకు క్యూర్‌గా కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా అమ్ముకోవచ్చని పతంజలికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ కరోనిల్ అనే పేరు హక్కులు వేరే కంపెనీకి ఉండడంతో పతంజలి మరో వివాదంలో ఇరుక్కుంది. అందులో నుంచి ఇంకా ఆ సంస్థ బయట పడలేదు.