దారులు వేరైనా గమ్యం ఒకటే.. మార్గాలు వేరైనా లక్ష్యం ఒకటే అన్నవిధంగా దూసుకుపోతున్నారు కమ్యునిస్టులు అనే కామెంట్లు గతకొన్ని రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. ఆ కామెంట్లకు మరింత బలం చేకూరుస్తూ ముందుకు పోతున్నారు కమ్యునిస్టులు! ఈ క్రమంలో తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ!
అవును… ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రస్థావించిన విషయాలు.. అరెస్టయ్యి బెయిల్ దొరక్క కొట్టుమిట్టాడుతున్న టీడీపీ నేతల తరుపున వకాల్తా పుచ్చుకుని, వారికోసం ఏదొకటి చేయాలనే తాపత్రయంతో రాశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇంతకూ ఆ లేఖలో రామకృష్ణ ప్రస్థావించిన అంశం… “కరోనా ఉధృతి నేపథ్యంలో ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిలుపై విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని” కోరడం!
అది ప్రాక్టికల్ గా సాధ్యమా.. ఉన్న ఖైదీలందరినీ పెరోల్ పైనా.. ముద్దాయిలందరినీ బెయిల్ పైనా విడుదల చేయడం సమంజసమేనా? జైళ్లలో కరోనా జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలి.. అవసరమైతే జైళ్ల శాఖ పరిధిలో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అని కోరాల్సిన రామకృష్ణ… ఏకంగా వారందరినీ విడుదల చేయాలని కోరుతుండటంపై అన్ లైన్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి!!
కరోనా ఇప్పట్లో పోయేది కాదనేది చాలా మంది చెబుతున్న మాట.. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టయిన అచ్చెన్నాయుడు బెయిల్ దొరక్క ఇబ్బందులు పడుతూ… రమేష్ హాస్పటల్ లోనే కాలం గడుపుతూ రెస్ట్ తీసుకుంటున్నారు! ఇక జేసీ, కొళ్లు రవీంద్ర ల సంగతి అంతే! ఈ క్రమంలో వారికోసం అడిగినట్టుగా ఉంది తప్ప.. ఏమాత్రం ఆలోచించి అడిగినట్లుగా లేదని… ఆన్ లైన్ వేదికగా రామకృష్ణపై కామెంట్లు పడుతున్నాయి. వాస్తవాలు పెరుమాళ్లకెరుక అంటే ఇదేనేమో!