ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి రూపొందించింన కరోనా వ్యాక్సిన్‌కు ఫేజ్ 3 ట్రయల్స్ అమెరికాలో ప్రారంభం కానున్నాయి. అమెరికాలోని 80 ప్రాంతాల్లో 30వేల మంది ఈ ట్రయల్స్‌లో పాల్గొననున్నారు. వీరికి కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇచ్చి ట్రయల్స్ నిర్వహిస్తారు. కాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేశారు.
ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌కు ఫేజ్ 3 ట్రయల్స్ అమెరికాలో ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రజలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 నుంచి జరగనున్న దృష్ట్యా అంతకు ముందుగానే కరోనా వ్యాక్సిన్‌ను అమెరికాలో అందుబాటులోకి తేవాలని ట్రంప్ యత్నిస్తున్నట్లు తెలిసింది.
కోవిడ్ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్‌పై ఆస్ట్రాజెనెకా స్పందిస్తూ… అమెరికాలో 18 ఏళ్లకు పైబడి ఆరోగ్యంగా ఉన్న లేదా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉన్న 30వేల మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది. అయితే చాలా త్వరగా ట్రయల్స్ ను చేపట్టి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది.