ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఢిల్లీలో ప్రస్తుతం కోవిడ్ 19 పరిస్థితి అదుపులోనే ఉందని, కంగారు పడాల్సిన పనిలేదని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని భయపడకూడదని, ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచిందని, అందుకనే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిపారు.
కాగా ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులు, మరణాలను బట్టి చూస్తే ఢిల్లీలో కోవిడ్ పేషెంట్ల మరణాల రేటు 1 శాతంగా ఉందని, జాతీయ స్థాయిలో అది 1.7 శాతంగా ఉందని, అందువల్ల భయం లేదని అన్నారు. అలాగే జాతీయ స్థాయిలో రికవరీ రేటు 77 శాతం ఉంటే ఢిల్లీలో 87 శాతంతో మనమే మెరుగ్గా ఉన్నామని తెలిపారు. కరోనా టెస్టుల సంఖ్యను భారీగా పెంచినందునే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురి కావల్సిన పనిలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు.
ఇక ఢిల్లీలో కోవిడ్ పేషెంట్లకు 14వేల బెడ్స్ ఏర్పాటు చేశామని, అందులో 5వేల బెడ్లను వినియోగిస్తున్నారని, వాటిలో 1700 బెడ్లలో ఢిల్లీ బయటి ప్రాంతాల వారు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. కాగా ఢిల్లీలో శుక్రవారం ఒక్క రోజే 2,914 కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 23న ఢిల్లీలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 3,947 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 1.73 లక్షలకు చేరుకోగా, 4,426 మంది చనిపోయారు. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఢిల్లీ 4వ స్థానంలో ఉంది.