ప్రియాంక గాంధీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు ఇది. గాంధీల కుటుంబానికి చెందిన నాయకురాలే అయినా.. రాజీవ్‌గాంధీ, సొనియాల గారాలపట్టి అయినా.. ఇంతలా గతంలో ఆమె పేరు దేశంలో వినిపించలేదు. ప్రత్రిక ముఖ శీర్షిక కథనాల్లో రెండు రోజులుగా ఆమె పేరు ప్రధానంగా చర్చకు వస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ప్రియాంక వేదికగా లైకులు.. కామెంట్లు పడుతున్నాయి. దీనిని గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు.. కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక తురుపుముక్కగా మారుతుందా ? అనే చర్చసాగిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత కుటుంబానికి చెందిన బాలికపై అత్యాచారం, అనంతరం హత్య జరగడం, దీనిని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొనలేక పోవడం, పోలీసులు వ్యవహరించిన తీరు, అర్ధరాత్రి వేళ యువతి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన వంటి ఘటనలను రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కంటే.. కూడా ప్రియాంక గాంధీ బాగా పుంజుకున్నారని అంటున్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ అత్యంత కీలకం. ఇక్కడ పార్టీ పుంజుకుంటే.. దేశవ్యాప్తంగా గుర్తింపు ఖాయమనే ధోరణిలో ముందుకు సాగారు. అదే సమయంలో హథ్రాస్‌కు వెళ్లే క్రమంలో పోలీసులు రాహుల్ గాంధీ చొక్కా పట్టుకోవడం, ఆయనపైనే లాఠీ చార్జీ జరగడం వంటి పరిణామాలు సింపతీకి కారణమయ్యాయి.
ఈ క్రమంలోనే ఎప్పుడూ గడపదాటని ప్రియాంక కూడా బయటకు రావడం, పట్టుదలతో హథ్రాస్‌కు చేరుకుని అన్నా చెల్లెళ్లు.. బాధిత కుటుంబాన్ని ఓదార్చడం వంటివి కాంగ్రెస్ కు ఊతమిచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లోనూ ప్రియాంకే హైలెట్ అయ్యారు. ఇది ముందుకు తీసుకువెళ్లి.. మున్ముందు మరిన్ని ఉద్యమాలు చేపట్టగలిగితే.. వరుస పరాజయాలతో పాటు.. చాలా రాష్ట్రాల్లో ఉనికి కూడా లేకుండా పోయిన కాంగ్రెస్‌కు ఊతం ఇచ్చినట్టేనని అంటున్నారు పరిశీలకులు. గతంలో ఇందిరాగాంధీ మాదిరిగా ఇప్పుడు ప్రియాంక కూడా దూకుడు చూపిస్తున్నారంటూ.. కొన్ని జాతీయ పత్రికలు వ్యాసాలు రాయడం.. గమనార్హం.
అదే సమయంలో మోడీ విధానాలపై రైతులు, నిరుద్యోగులు, వ్యాపారులు కూడా అసహనంతో ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకునేందుకు అవకాశం ఉందని, అయితే, రాహుల్ ఈ విషయంలో ఒకింత వెనుకబడినా.. అన్నా చెల్లెళ్లు తాజాగా కలిసి పోరాడిన తీరుకు మాత్రం మార్కులు బాగానే పడుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్తే.. కాంగ్రెస్‌కు తిరిగి పాతరోజులు వస్తాయని చెబుతున్నారు. మరి రాహుల్ పోయి.. ప్రియాంక వచ్చేసింది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందో లేదో ? చూడాలి.
– vuyyuru subhash