ఈరోజు ఏపీలో పర్యటించనున్న కేంద్ర బృందాలు ఆ పర్యటనకి వెళ్ళే ముందు ఏపీ సీఎస్ నీలం సాహ్నీతో భేటీ అయ్యారు. అనంతరం క్షేత్ర స్థాయి పర్యటనలకు బయలుదేరి వెళ్ళాయి కేంద్ర బృందాలు. అనంత జిల్లాకు హెలీకాప్టరులో కేంద్ర బృందం బయలుదేరి వెళ్ళింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ క్షేత్ర స్థాయిలో వరద నష్టం అంచనాపై కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి.
ఇక మొత్తంగా రూ. 6386.67 కోట్ల నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఆర్ అండ్ బికు సుమారు రూ. 2977 కోట్ల మేర నష్టం జరిగిందని, వ్యవసాయానికి రూ. 804 కోట్లు నష్టం జరిగిందని చెబుతున్నారు. ఉద్యాన పంటలకు రూ. 483 కోట్ల నష్టం కలగగా పంచాయతీ రాజ్ విభాగానికి రూ. 782 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. అలానే మున్సిపల్ పరిపాలనా శాఖకు రూ. 75 కోట్లు నష్టం జరిగినట్టు చెబుతున్నారు. దీంతో కేంద్ర బృందాన్ని రూ.6,386.67 కోట్ల సాయం కోరింది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణ సాయంగా రూ.840 కోట్లు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేసింది.