రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కావాల్సిన అవసరం లేదు. కేడర్‌ను సమన్వయం చేసే సత్తాతో పాటు… క్యాడర్‌కు కష్టాలు వచ్చినప్పుడు నిలబడే దమ్ముంటే చాలు… అలాంటి నేతలకు ఎలాంటి పదవులు లేకపోయినా… ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా… ప్రజల మన్ననలు ఎప్పుడూ ఉంటాయి. కాకలు తీరిన రాజకీయ యోధుడు మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి.రామచంద్ర రావు బావమరిది మేడవరపు అశోక్ బాబు సైతం ఇదే కేటగిరికి చెందిన రాజకీయ నేతగా భావించాలి. రెండున్నర దశాబ్దాలుగా పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గ రాజకీయాల్లో అశోక్ బాబు దిన దిన ప్రవర్ధమానం చెందుతున్నారు. గతంలో తెలుగుదేశంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా అశోక్‌ది ప్రజాక్షేత్రంలో అందెవేసిన చేయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధంతో ఆ పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు అశోక్ ఎమ్మెల్యే స్థాయితో సరిసమానమైన రాజకీయ నేతగా ఎదిగారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చిన అశోక్ జగన్ దగ్గర తిరుగులేని నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు. తన బావ కెవిపి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మధ్య ఎంత ప్రత్యేకమైన అనుబంధం ఉండేదో…. నేడు అశోక్ అన్నా జగన్ వల్లమాలిన అభిమానం చూపిస్తారు. అశోక్ టీడీపీలో ఉన్నా తెరవెనకే పాత్రకే ఎక్కువ పరిమితం అయ్యారు. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఆయన చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి అలంకరించారు.
అశోక్ బావ కేవీపీ ఏమో వైఎస్సార్ ఆత్మ. ఇక్కడ అశోక్ బలమైన మాస్ లీడర్. వాస్తవానికి 2009లో చింతలపూడి రిజర్వ్ కాకపోయి ఉంటే అశోక్‌కు నాడే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు వచ్చి ఉండేది. అయితే రిజర్వ్ కావడంతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత అశోక్ ఏఎంసీ చైర్మన్ అవ్వడంతో పాటు మళ్లీ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి తమ వర్గానికి చెందిన కోటగిరి శ్రీథర్‌కు ఏకంగా ఏలూరు ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకోవడంలో తనదైన పాత్ర పోషించారు. ఎప్పటకి అయినా అశోక్ మెయిన్ టార్గెట్ అసెంబ్లీయే. జగన్ కూడా అశోక్‌కు అసెంబ్లీ సీటు ఇచ్చే విషయంలో ఎలాగూ సుముఖంగానే ఉంటారు.
పునర్విభజపైనే ఆశలు ….
అశోక్ ఎమ్మెల్యే అవ్వాలంటే వచ్చే రెండేళ్లలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనే కీలకం కానుంది. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే వచ్చే ఎన్నికలలోపుగా నియోజకవర్గాల పునర్విభజకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. అదే జరిగితే మెట్ట ప్రాంతంలో చింతలపూడితో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన జంగారెడ్డిగూడెం కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఆవిర్భవించనుంది. అప్పుడు చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో ఏదో ఒక నియోజకవర్గం జనరల్‌గా ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో వైసీపీ నుంచి కమ్మ, కాపు, క్షత్రియులకు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వెలమ కోటాలో అశోక్‌కే ఈ జనరల్ నియోజకవర్గం నుంచి ఫస్ట్ ఆప్షన్ ఉంది.
గతంలో ఇదే వెలమ వర్గం నుంచి దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు ఇదే చింతలపూడి నుంచి ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర స్థాయి రాజకీయాలను శాసించగా… ఇప్పుడు అదే వర్గం నుంచి ఆ ప్లేస్‌ను అశోక్ చాలా వరకు భర్తీ చేస్తున్నారు. మరి అశోక్ అసెంబ్లీ ఎంట్రీ కాలమే నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదు. సరైన సీటు దొరకాలే కాని ఆయనకు జగన్ టిక్కెట్ ఇచ్చే విషయంలో డౌట్లే లేవు. అశోక్ సైతం ఎమ్మెల్యే పదవిపై గురిపెట్టే అందుకు అనుగుణంగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటోన్న వాతావరణమే కనిపిస్తోంది.