హైదరాబాద్ అంటేనే బిరియానీకి ఫేమస్. ప్రపంచంలో దాదాపు అన్ని ప్రముఖ ప్రాంతాల్లో హైదరాబాద్ బిర్యానీ మెనూలో ఉంటుంది. ఇక నగరంలో బిర్యానీ దొరకని ప్రాంతమే ఉండదు. అందుకే చిన్న చిన్న రెస్టారెంట్లతో పాటు బడా బడా స్టార్ హోటల్స్‌లోనూ బిర్యానీ ఘుమఘుమలు కనిపిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న బిరియానీ… ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కొత్త వివాదానికి దారి తీసింది. ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నేతల విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒక పార్టీపై మరోపార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఎంఐఎం నేతలు కూడా సంచలన వ్యాఖ్యలతో వేడిని మరింతగా పెంచుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, మజ్లిస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. విమర్శలు, కౌంటర్లు, ఆరోపణలతో చిచ్చురాజేస్తున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు…బీజేపీ, మజ్లిస్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. రోహింగ్యాల నుంచి హైదరాబాద్ పేరు మార్పు వరకూ…అంశం ఏదైనా ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయ్. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ… బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు. కమలం పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వారు పాత బస్తీకి వస్తే బిరియానీ తిన్పిస్తానని సెటైర్లు వేశారు.
అసద్ కామెంట్లకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అసద్దుద్దీన్ తమకు బిర్యానీ తినిపిస్తానన్నారని, మేము కూడా ఆయనకి బిర్యానీ తినిపిస్తామన్నారు. తమ దగ్గర వాల్మీకి సమాజ్ వాళ్ళు పిగ్ బిర్యానీ బాగా చేస్తారన్నారు రాజాసింగ్. హిందు ముస్లింల మధ్య ఓవైసీ బ్రదర్స్ గొడవ పెట్టాలని చూస్తున్నారని ఫైరయ్యారు. బీజేపీ, మజ్లిస్ నేతల తీరు చూస్తుంటే…వ్యక్తిగత విమర్శలకు వెనుకాడట్లేదనిపిస్తోంది. ఎన్నికల హామీలు మరిచి… ఆహారపు అలవాట్లపైన విమర్శలు చేసుకునే వరకూ వెళ్లారని ఓటర్లు తిట్టుకుంటున్నారు.