ఒక్కప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. జిల్లాలో వారు చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా ఉండేది. అలాంటి నేతలు ఇప్పుడేమైపోయారో తెలియడం లేదు. యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారో లేక ఇక భవిష్యత్ లేదని నిర్ణయించుకున్నారో కానీ.. లూప్‌లైన్‌లోకి వెళ్లిపోయారు.
పదవిలో ఉన్నన్నాళ్లూ ఏం చేసినా చెల్లుతుంది. కానీ.. ఒక్కసారి పొలిటికల్ తెర నుంచి ఫేడ్ అవుట్ అయ్యామా? ఎవరూ పట్టించుకోరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆ మాజీ ప్రజాప్రతినిధుల పరిస్థితి కూడా అలాగే ఉంది. జిల్లా రాజకీయాలను, యంత్రంగాన్ని తమ చేతిలో పెట్టుకుని ఆడించిన నాయకులు.. ఇప్పుడు బొంగరంలా తిరుగుతున్నారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు. ఇటు చూస్తే రాజకీయ భవిష్యత్ కనిపించడం లేదు అటు చూస్తే వయసు మీద పడుతోంది. దీంతో ఒకప్పుడు నలుగురు నోట్లో నానిన నేతలు ఇప్పుడు నల్లపూసలైపోయారు.
కేంద్రమంత్రిగా పనిచేసిన వేణుగోపాలాచారి ఈ తరం పాలిటిక్స్‌లోకానీ.. ఈతరం నేతలతో కానీ పోటీపడలేని పరిస్థితి ఉంది. నాడు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన చరిత్ర ఆయనది. కార్మిక మంత్రిగా పనిచేసిన బోడ జనార్దన్ సైతం సోదిలో లేకుండా పోయారు. మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావులు రాజకీయ పోరాటం చేయాలని పరితపిస్తున్నా వారికి కాలం కలిసిరావడం లేదన్నది టాక్. అరవిందరెడ్డి అటూ ఇటూ జంప్ చేయడంతో ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయిందనే వారు ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నా.. పార్టీ పెద్దలు ఎంత వరకూ పరిగణనలోకి తీసుకుంటారన్నది అనుమానమేనని అంటున్నారు. ప్రేమసాగర్‌రావు కాంగ్రెస్‌లో ఉన్నారో లేరో కూడా తెలియడం లేదట.
మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి.. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. పార్టీ మారి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినా అదృష్టం కలిసి రాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నా.. రాథోడ్ రమేష్ పార్టీ మారిపోతారనే టాక్ బలంగా ఉంది. అయితే మునుపటిలా ఆయన కుటుంబానికి జిల్లాలో ప్రాధాన్యం లభిస్తుందా లేదా అన్నది చూడాలంటున్నారు.
ముథోల్‌లో నారాయణరావ్ పటేల్‌ది మరో చరిత్ర. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఓ వెలిగి వెలిగారు. టికెట్ కోసం కండువా మార్చేశారు. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ సీనియర్ పొలిటీషయన్‌ను చూసినా.. శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి దిగజారిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.