ఆ ఒక్క‌ ఘటన ఏపీ రాజకీయాలను మార్చేసినట్టుందే ?

-

సత్యప్రమాణాలతో ఈ ఒక్క ఘటన రాష్ట్ర రాజకీయలను మరో మలుపు తిప్పింది. రాష్ట్రవ్యాప్తంగా దేవుళ్ల మీద ప్రమాణాలకు దారితీసిన బిక్కవోలు ఎపిసోడ్‌ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఈ ఎపిసోడ్‌లో ఎవరు పైచేయి సాధించారన్నది జిల్లా రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.


తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. గత నెల 23న వీరిద్దరూ బిక్కవోలు వినాయకుడి గుడిలో చేసిన సత్య ప్రమాణాలతో నేడు రాష్ట్ర రాజకీయాలు ఆ దిశగా టర్న్‌ తీసుకున్నాయి. వినాయకుడి విగ్రహానికి చెరోవైపు సతీసమేతంగా నిలుచున్న నాయకులు సత్యప్రమాణాలు చేశారు.

ఆ ఘటనకు ముందు నుంచి వివిధ అంశాలపై వైసీపీ, టీడీపీ నేతలు ఆరోపణలు చేసుకున్నారు. ఎవరికి వారుగా సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి ఆరోపణలను ఖండించారు కూడా. అక్కడితో ఊరుకోకుండా.. ప్రసిద్ధి చెందిన బిక్కవోలు వినాయకుడి గుడి దగ్గర దైవసాక్షిగా సత్యప్రమాణం చేద్దామని ఒకరినొకరు ఛాలెంజ్‌ చేసుకున్నారు. దానికి సై అని చెబుతూ ఇద్దరు ఒకేసారి ఆలయం దగ్గరకు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరకు సత్య ప్రమాణం సమయంలోనూ గందరగోళ వాతావరణం ఏర్పడింది.

వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి ప్రజా వైద్యుడిగా స్థానికంగా పేరుంది. ప్రజలు ఆయన్ని పది రూపాయల డాక్టర్‌గా పిలుచుకుంటారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నాటి నుంచి అడపా దడపా ఎమ్మెల్యేను టార్గెట్‌ చేస్తూనే ఉంది టీడీపీ. రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలా వదిలేస్తే బాగోదని అనుకున్నారో ఏమో.. సత్యప్రమాణాలు చేద్దామని బయలుదేరడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సిద్ధపడటంతో స్థానిక రాజకీయం కూడా వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. రేపో మాపో ఎన్నికలన్నట్టు ఈ ఎపిసోడ్‌లో నేతలు చేసిన హడావిడి ఆసక్తికర చర్చకు దారితీసింది. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త పట్టు సాధించేందుకు ఈ పోరు ఉపయోగపడుతుందనే టాక్‌ రెండు శిబిరాల్లోనూ వినిపిస్తోంది. స్తబ్దుగా ఉన్న కేడర్‌లోనూ సత్యప్రమాణాలు చురుకు పుట్టించాయట.

పొలిటికల్‌ మైలేజీ ఎలా ఉన్నా.. ప్రజలకు మాత్రం ఆ రోజంతా కావాల్సినంత వినోదం లభించింది. దేవుడు దగ్గర ఎవరు ఎలా ప్రమాణం చేశారు? ఏవరేమన్నారు? అన్న ప్రశ్నలపై ఆరా తీశారు. నేతలు ఎవరి వాదన వారు వినిపించడంతో ఇప్పటి వరకు ఏం తేలలేదు. తప్పు చేయలేదని దేవుడి దగ్గర ప్రమాణం చేసేసినందున ఇకపై మాజీ ఎమ్మెల్యే చేసే ఆరోపణలను పట్టించుకోబోనని చెబుతున్నారు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి. ఇటు మాజీ ఎమ్మెల్యే వాదన కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యేతో తనకు ఆస్తి తగాదాలు లేవని.. నియోజకవర్గంలో జరుగుతోన్న అవినీతినే ప్రస్తావించానని చెబుతున్నారు రామకృష్ణారెడ్డి. పైగా తన ఆరోపణలకు సమాధానం లభించలేదని కథను మళ్లీ మొదటికి తీసుకొచ్చారు.

వైసీపీ, టీడీపీలు దేవాలయాన్ని రాజకీయ వేదికగా చేసుకోవడం మాత్రం విమర్శలకు దారితీస్తోంది. నేతల తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నది కొందరి వాదన. ఇలాంటి వాటికి దేవాదాయశాఖ అనుమతి ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news