స్థానిక ఎన్నికల్లో టీడీపీని కలవర పెడుతున్న వాలంటీర్లు

-

టీడీపీ అధిష్ఠానం పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం నేతలతో కాన్ఫరెన్స్‌లు పెడుతూ పోటీ పై దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామస్థాయిలో పట్టుదలలకు, పంతాలకు ఎక్కవ ప్రాధాన్యం ఇచ్చే నేతలు పోటీకి సై అంటున్నారు. కానీ పోటీకి ఉత్సాహంగా ఉన్నవారికి కొత్త సమస్యలు కలవరపెడుతున్నాయట…

పార్టీ గుర్తు లేకపోయినా పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం కామన్‌. అధికార పార్టీకి ఇలాంటి ఎన్నికలు కాస్త ప్రతిష్టాత్మకంగానే ఉంటాయి. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎలా ఉంది.. ఏ మంత్రి ఇలాకాలో ఏం జరిగింది? అన్నది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను అధికార పార్టీ నేతలు సీరియస్‌గానే తీసుకున్నారు. ఏకగ్రీవాలపై ఫోకస్‌ పెట్టారు వైసీపీ నాయకులు. పోటీకి వస్తారా రారా అన్న పరిస్థితి నుంచి పోరాడదాం అనే స్థాయిలో టీడీపీ మద్దతుదారులు బరిలో దిగుతున్నారు. అయినా కొన్ని ఇక్కట్లు తప్పడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది.

వాలంటీర్ల వ్యవస్థతో ఈసారి ఎన్నికల్లో తమకు ఇబ్బందులు ఉంటాయని ప్రతిపక్ష అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. పోటీలో ఉన్నా.. ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చినా సంక్షేమ పథకాలు కట్ అని వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారట. దీంతో పోటీకి ఆసక్తితో ఉన్నవారు సైతం ఆలోచనలో పడుతున్నారట. వాలంటీర్ల కారణంగా గ్రామంలో ఏ ఓటర్ ఎటు ఉన్నారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సి వస్తుందేమో అన్న భయం నెలకొందట. కొన్నిచోట్ల వీటన్నింటికీ ఎదురొడ్డి బరిలో నిలుచున్నా నిధుల సమస్య వేధిస్తోంది.

ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారట. గత ఎన్నికల ముందు చేసిన ఉపాధి హామీ పనుల బిల్లులు రాకపోవడం వారిని ఇప్పటికీ ఇబ్బంది పెడుతోంది. నామినేషన్ పద్దతిలో పార్టీ నేతలు చేసిన పనులకు 1900 కోట్లు బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందట. అవి ఇప్పటి వరకు రిలీజ్‌ కాలేదు. సొంత డబ్బులతో నాడు పనులు చేసిన వారు… ఇప్పడు మళ్లీ ఖర్చు అంటే భయపడుతున్నట్టు సమాచారం. ఎన్నికలు అంటేనే భారీ ఖర్చుగా మారిపోయిన తరుణంలో.. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితి తలచుకుని ఆందోళన చెందుతున్నారట.

నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, ముఖ్యనేతల నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో గతంలో పోటీ చేసిన వారు ఇప్పుడు సైలెంట్‌ అయ్యారట..ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీకి కూడా నివేదికలు అందుతున్నట్టు తెలుస్తోంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news