సాధారణంగా మన స్నేహితులు గానీ బంధువులు గానీ ఎవరైనా నా మన బండి ఒకసారి నడపడానికి ఇవ్వమంటే మనం పెద్దగా ఆలోచించం. అడిగేది మన వాళ్లే కదా ఏమవుతుందిలే అని ధీమాతో వెంటనే వారికి ఇచ్చేస్తాం. అలా చేయవద్దు అని చట్టాలు చెబుతున్నా, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా అవి మన బుర్రకు ఎక్కవు. కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం లైసెన్స్ లేని బళ్ళు నడపడమే నేరమైతే ఆ బండ్లు ఇచ్చిన ఓనర్ లది కూడా నేరమేనని వారికి కూడా శిక్ష పడుతుందని చెబుతున్నారు. ఇప్పటి దాకా పెద్దగా అలాంటి శిక్షలు పడిన దాఖలాలు మన దృష్టికి రాలేదు.
కానీ తాజాగా లైసెన్స్ లేని ఒక యువతికి వాహనం ఇచ్చి ఆమె మృతికి కారణమయ్యాడు అనే కారణంగా ఒక యువకుడిని జైలుకు పంపారు పోలీసులు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈనెల 20వ తేదీన అర్ధరాత్రి హైదర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక డెంటల్ వైద్య విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమెకు వాహనం ఇచ్చిన అజయ్ సింగ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రేష్మ కి బండి నడపడం రాదు, దీంతో అసలు లైసెన్స్ వచ్చే అవకాశమే లేదు. ఈ విషయం తెలిసి కూడా రాత్రి సమయమే కదా ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఆమెకు బండి ఇచ్చిన అజయ్ మీద పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు దీనిని తీవ్ర నిర్లక్ష్యంగా భావించి అతనికి రిమాండ్ విధించింది.