చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పంచిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ముగ్గురికి నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కలెక్టర్ ముగ్గురికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. లడ్డూ ప్రసాదంతో వోటర్లను ప్రలోభాలకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.. ఫొటోలు వీడియోలను కలెక్టర్ కు సర్పంచ్ అభ్యర్థి అందించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
అయితే ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల సంఘానికి కూడా సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో ముగ్గురికి జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మీద టీటీడీ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున తిరుపతి లడ్డూలు ఇలా బయట వారికి పంచటం అంటే సామాన్యమైన విషయం కాదు. సామాన్య భక్తులకు లడ్డూ ప్రసాదం దొరకడమే గగనం అయిపోతున్న పరిస్థితుల్లో ఇలా పంచిన అంశం చర్చనీయాంశంగా మారింది.