తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. త్వరలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటమే దీనికి కారణం. విలీన గ్రామాల సమస్య కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో మొన్న అన్ని కార్పొరేషన్లతో కలిపి ఇక్కడ ఎన్నికలు జరగలేదు. కాకపోతే జిల్లాలోని పది మున్సిపాలిటీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో ఇక్కడ కూడా రాజకీయం కొత్త మలుపు తిరుగుతుందనుకుంటున్నారు. అయితే ప్రధాన పార్టీలైన టీడీపీ,వైసీపీలను వర్గపోరు కలవర పెడుతుంది.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీదే హవా. పార్టీ బలంగానే ఉందని నేతలు భావిస్తున్నారు. ఆదిరెడ్డి భవానీ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడంతో కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే అధికార పార్టీని ఎదుర్కొని ఆదిరెడ్డి కుటుంబం ఏ మేరకు పాగా వేస్తుందన్నది ప్రశ్నగా ఉందట. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఆదిరెడ్డి అప్పారావుల మధ్య గ్రూప్ వార్ నడుస్తోంది. గోరంట్ల వర్గం సిటీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకోవడం లేదట. ఇదే సమయంలో గోరంట్ల వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారట. అయితే టికెట్ హామీ ఇస్తేనే గోడ దూకుతామని స్పష్టం చేసినట్టు సమాచారం.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లో 21 గ్రామాలను విలీనం చేశారు. వాటిలో పది గ్రామాలకు ఆమోదం లభించినా.. మిగతా 11 గ్రామాలపై వివాదం ఉంది. ఈ నెల 31న కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ పురపోరుకు లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవలే జిల్లా ఇంఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ రాజమండ్రిలో పర్యటించి.. కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయింది. అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది వైసీపీ.
ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఎంపీ మార్గాని భరత్ ఆశీస్సులు ఉన్న కొత్త టీమ్ చేతుల్లోకి వైసీపీ వ్యవహారాలు వెళ్లాయట. మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కోఆర్డినేటర్‌గా వచ్చారు. అయితే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ వర్గాలకు అస్సలు పడటం లేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినా అది ఎంతో కాలం నిలవలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయానికి వీరి మధ్య పంచాయితీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం కావడం లేదట. సిటీ వరకు వచ్చే సరికి.. అటు టీడీపీ, ఇటు వైసీపీ ఒకే విధంగా ఆధిపత్య పోరుకు ప్రాధాన్యం ఇస్తుండటం రెండు శిబిరాలనూ కలవరపెడుతోందట. ఎన్నికల ముంగిట రెండు పార్టీలు ఈ వర్గపోరుని ఎలా చక్కబెడతాయో చూడాలి.