అసెంబ్లీ ఎన్నికల్లో మారిన సీన్..సినీ తారల సభలకు తరలిరాని జనం

-

ఎన్నికల ప్రచారానికి సినిమా తారలు వస్తున్నారంటేనే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు మాత్రం తారల ప్రచారం అంటేనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు హడలెత్తిపోతున్నారు. గతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చే జాతీయ, రాష్ట్రస్థాయి ముఖ్యనేతల సభలను విజయవంతం చేసేందుకు జనాన్ని భారీగా తరలించేవారు. బహిరంగ సభలకు ప్రజలు రాకపోతే..డబ్బులు, ఆహారం పంపిణీ చేసి తీసుకెళ్లేవారు. సహజంగానే సినిమా తారలను చూసేందుకు ప్రజలు ఎగబడేవారు కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సీన్‌ మారింది.


తమిళనాడులో సినీతారల ప్రచారం, సభలకు ప్రజలు పెద్దగా రావడం లేదు. వచ్చినా వారి నుంచి అంతగా స్పందన కనిపించడం లేదు. నిత్యం టీవీల్లోనూ, రకరకాల షోలలోనూ కనిపించే తారలే కదా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అభ్యర్థులు.. సినీ తారల ప్రచారం పట్ల విముఖత చూపుతున్నారు. నియోజకవర్గానికి ఫలానా సినీతారను పంపిస్తున్నామంటూ. పార్టీ అధిష్ఠానం నుంచి కబురు అందితే మాత్రం కాదనలేకపోతున్నారు అభ్యర్థులు. అలాగని తగిన ఏర్పాట్లు చేయలేక బెంబేలెత్తిపోతున్నారు. సభలకు ఆశించిన జనం రాకపోవడంతో అభ్యర్థులు నగదు పంపిణి చేసి మరీ జనాన్ని రప్పించాల్సి వస్తోంది.

థౌజెండ్‌లైట్స్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న నటి ఖుష్బూ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయని గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. సదరు నేతపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతా అయ్యాక వెనుక నుంచి ఓ నేత.. మేడం ఆ పాత ఎమ్మెల్యే సెల్వం మీ పక్కనున్న ఆయనే అని చెవుల్లో చెప్పాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడున్న కార్యకర్తలతా పెద్దపెట్టున నవ్వుతూ కేకలేశారు.

ఇక తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీకి గంట కంటే ఎక్కువ సేపు ప్రచారం చేయలేనంటున్న వీడియోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. సీఎం మమతా బెనర్జీ కోసం కూడా అంత సమయం కేటాయించలేను అన్నట్లుగా నుస్రత్‌ వ్యాఖ్యానించినట్లు అందులో ఉంది. సొంత పార్టీకి ఎన్నికల్లో సరైన ప్రచారం చేయలేని స్థితిలో టీఎంసీ పార్టీ ఎంపీలు ఉన్నారని బీజేపీ విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news