తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టేనా

-

తెలంగాణలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అసెంబ్లీలో ఆ పార్టీకి మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఎమ్మెల్యే నాగేశ్వరరావు అధికారికంగా టీఆర్ఎస్‌లో చేరారు. మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తెలంగాణలో టీడీపీ శకం ముగిసిందా అన్న చర్చ మొదలైంది.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ బలహీనపడుతూ వస్తోంది. 2014లో 15 మందికిపైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పటికీ.. వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షం టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనమైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ తరపున గెలిచారు.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కూడా ఏపీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇక తెలంగాణలో పార్టీకి ఆదరణ లేక సీనియర్లంతా ఎవరిదారి వారు చూసుకున్నారు. తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని పలుమార్లు నేతల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు పార్టీ అధినేత చంద్రబాబు. పార్టీకి కాస్తో కూస్తో ఆదరణ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం టీడీపీ ఒక్క సీటు దక్కించుకోలేదు. 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్‌ కూడా దక్కలేదు.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం కేసీఆర్ తో భేటీ అయి టీఆర్ఎస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే మచ్చా నాగేశ్వరరావు మాత్రం టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో టీడీఎల్పీ శకం ముగిసినట్టైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news