175 స్థానాల్లో జనసేన పోటీ – పవన్ కల్యాణ్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్…. ‘నాకసలే తిక్క ఆ తిక్కకు ఓ లెక్కుంది’ అంటూ ఓ సినిమాలో వాడిన పంచ్ డైలాగ్ ప్రస్తుతం నిజమనిపిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో పవన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.

ఇందులో భాగంగానే… వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనికి తోడు రెండు రోజుల క్రితం చంద్రబాబు మీడియాతో  స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌తో కలిస్తే ఆయనకొచ్చే బాధేంటని జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బాబు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది… పవన్ తో కలిసేందుకు తాము సుముఖంగానే ఉన్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబుకు పవన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా …వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ కలిసే ఆలోచన లేదని పవన్ ట్విట్టర్ వేదికగా  స్పష్టం చేశారు. కేవలం తమ భావజాలంతో ఏకీభవించే వామపక్షాలతోనే తామె వెళ్తామని చెప్పారు. మొత్తం 175 స్థానాల్లో జనసేన పార్టీ సంపూర్ణంగా పోటీచేస్తుందని తెలిపారు. జనసేన పార్టీ ఎన్నికల కోసం మాత్రమే రాలేదని, పాతిక తరాల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి, వారికి మెరుగైన జీవన విధానాన్ని కల్పించడానికి వచ్చిందన్నారు. మా పార్టీలో యువత ఆశయాలను, ఆడపడుచుల ఆకాంక్షలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నామని పవన్ చెప్పారు.

 గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబుకు మద్దతిచ్చానని ఇప్పటికే పలుమార్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ తమ పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటిచేస్తుందని కుండబద్దల కొట్టినట్లు చెప్పడంతో …. ఇక ఏపీలో ముక్కోణపు పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైన ఏపీలో  రాజకీయం రసవత్తరంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news