దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుండడంతో దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించాలని ప్రధాని మోదీకి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న విషయం విదితమే. అయితే దేశంలో కోవిడ్ పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఆగస్టు 1 వ తేదీ వరకు సుమారుగా 10 లక్షల మంది కోవిడ్‌కు బలవుతారని, కనుక వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.
భారీ ఎత్తున కోవిడ్ మరణాలు సంభవించకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే నియంత్రణ చర్యలు చేపట్టాలని ది లాన్సెట్ సూచించింది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, భవిష్యత్తులో ఇది పెను విపత్తుగా మారేందుకు అవకాశం ఉంటుందని, ఇందుకు ప్రధాని మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సంక్షోభం సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారిని అణచి వేయాలని చూస్తున్న తీరు బాధాకరమని, అలాంటి చర్యలను ఎంత మాత్రం క్షమించలేమని తెలిపింది. దేశంలో కోవిడ్ ఎమర్జెన్సీ ఉందని పేర్కొంది.
దేశంలో కోవిడ్ బాధితులతో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయని, మెడిసిన్లు, బెడ్లు, ఆక్సిజన్, ఇతర సదుపాయాలు లేవని, తగినంత మంది వైద్యులు, సిబ్బంది కూడా లేరని లాన్సెట్ పేర్కొంది. అయితే ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, భారత్ తాను సాధించిన విజయాలను ఇప్పుడు చర్చించుకునేంత సమయం లేదని, ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలో ఆలోచించాలని సూచించింది. కేంద్రం ఇప్పటికైనా మేల్కొనాలని, కోవిడ్ కట్టడి చర్యలను శరవేగంగా చేపట్టాలని, ముందుగా లాక్‌డౌన్ విధించాలని, తరువాత టీకాలను వేగంగా పంపిణీ చేయాలని, దీంతోపాటు కఠిన ఆంక్షలను అమలు చేయాలని సూచించింది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ది లాన్సెట్ హెచ్చరికలు జారీ చేసింది.