దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఆయా సంస్థలు నిర్వహించే టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేవలం సంస్థలకు చెందిన ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలని, వారి కుటుంబ సభ్యులు, బంధువులకు టీకాలను వేయకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోకుండా నిరోధించాలని తెలిపింది.
కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులకు టీకాలను వేయకూడదని, కేవలం ఉద్యోగులకు మాత్రమే టీకా పంపిణీని పరిమితం చేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలను సూచించింది.
అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ వివరాలు తమకు తెలియవని, కంపెనీలు, పరిశ్రమలకు చెందిన యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కంపెనీలు, పరిశ్రమల నుంచి ప్రభుత్వాలు వివరణ కోరుతున్నాయి. అయితే ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులకు టీకాలను పంపిణీ చేసేందుకు అనుమతులు ఇచ్చినా ప్రస్తుతం 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాలను ఇచ్చేందుకు టీకాల కొరత ఉంది కనుక ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం అసాధ్యమని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల కుటంబ సభ్యులకు టీకాలను ఇచ్చినట్లయితే టీకాలకు మరింత కొరత ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.