తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుని రేవంత్‌రెడ్డికి పగ్గాలు ఇవ్వడంతోనే అన్ని పార్టీలూ కాస్త అలర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇమేజ్ను తగ్గించేందుకు ఇటు బీజేపీ అటు టీఆర్ ఎస్‌లు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి(kishan reddy)కి కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇవ్వడం కూడా ఇందులో భాగమే అంటూ ప్రచారం ఊపందుకుంది.
ఎందుకంటే రేవంత్‌ను ఎంతమంది సీనియర్లు వ్యతిరేకించినప్పటికీ కూడా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం పట్టుబట్టి ఆయనకే టీపీసీసీ చీఫ్ పదవి కేటాయించడంతో ఆయనకు ప్రజల్లో అమాంతం ఇమేజ్ పెరిగిపోయింది. దీంతో బీజేపీ వైపు చూసేవారంతా కాంగ్రెస్ వైపు చూడటం మొదలు పెట్టారు.
ఈ మార్పులతో ఎలాగైనా ప్రజల దృష్టిని, ఇతర పార్టీల్లోని అసంతృప్తుల దృష్టిని మళ్లీ బీజేపీవైపు తిప్పుకునేందుకు కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డికి ప్రమోషన్ ఇచ్చారనే ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రానికి బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలుపుకోవడంతో పాటు తెలంగాణ నాయకత్వం బలంగా మారడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది. ఇక రేవంత్ కూడా ఈ ఊహాగానాలపై స్పందించారు. తనవల్ల బీజేపీ ప్లాన్ చేసి మరీ కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చారని చెప్పడం గమనార్హం.