హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈటల బీజేపీలో చేరిపోవడంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో లక్ష మెజర్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా అదే తరహా ప్రకటనలు ఇస్తోందని రఘునందన్ రావు గుర్తు చేశారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు, వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని మండిపడ్డారు. నోట్ల కట్టలు వెదజల్లినా ప్రజలు మాత్రం ఈటలకే పట్టం కడతారని రఘునందన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ ఎంత కష్టపడి పని చేసిందో… అలాగే హుజూరాబాద్‌లో కూడా అలానే పని చేస్తుందని చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, ఏడేళ్ల అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఇన్నేళ్లలో ఒక్క బలమైన బీసీ నేతను కూడా తయారు చేయలేకపోయిందని విమర్శించారు. ఊరంతా ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన గెలుపురాదని టీఆర్ఎస్ నేతలకు రఘునందన్ రావు సూచించారు.