తెలంగాణ గడ్డమీద ఇప్పుడు రాజకీయాలు అత్యంత వేగంగా అన్ని పార్టీలను కుదిపేస్తున్నాయనే చెప్పాలి. అనూహ్యంగా ప్రతి పార్టీలో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇవి ఏకంగా రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో ఏ పార్టీని కూడా బలమైన పార్టీగా అనుకోవడానికి లేకుండా పోయింది. ఇప్పుడు రేవంత్ (revanth) రాకతో అన్ని పార్టీల్లో కూడా కలవరం మొదలైంది. ఆయా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారంతా మళ్లీ కాంగ్రెస్ గూటికే వస్తున్నారు.
కాకపోతే రేవంత్‌రెడ్డి ప్రభావం కొందరిని పార్టీకి రాజీనామా చేయిస్తే… మరి కొందరిని చేయి కలిపేలా చేస్తోంది. ఇదే క్రమంలో నిన్న కౌశిక్‌రెడ్డి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కానీ రేవంత్ మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా అందర్నీ మళ్లీ కాంగ్రెస్ గూటికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు చేవెళ్ల మాజీ ఎంపీ అయిన కీలక నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భేటీ కావడం సంచలనం రేపుతోంది. గత కొంత కాలంగా కొండా బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఆయన గత లోక్ సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో టీఆర్ ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. కానీ మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత ఆయన హస్తానికి కూడా హ్యాండ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరలేదు. కానీ ఇప్పుడు రేవంత్ మాత్రం ఆయన్ను మళ్లీ కాంగ్రెస్ గూటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.