రాజకీయ వ్యూహకర్తగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మంచి పేరుంది. ప్రతీ విషయం మీద అవగాహన ఉండటమే కాదు ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలనే విషయమై సీఎం కేసీఆర్‌కు ఫుల్ క్లారిటీ ఉంటుందని గులాబీ పార్టీ వర్గాలు చర్చించుకుంటాయి. అయితే, తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకుగాను స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. ‘దళిత బంధు’ స్కీమ్ ( Dalita Bandhu scheme )ను తెరమీదకు తీసుకొచ్చారు.
ఇకపోతే హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకుగాను ఇతర పార్టీల నుంచి నేతలను, ఈటల అనుచరులను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురికి పదవులు ఇస్తున్నారు. వ్యూహంలో భాగంగానే సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో కాకుండా ‘దళిత బంధు’ స్కీమ్‌ను వాసాలమర్రిలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను సీఎం సరికొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమస్వరాలను మళ్లీ తెరమీదకు తీసుకొస్తున్నారు ఆయన.
ప్రజావాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాంస్కృతిక సారథి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటలు తెలంగాణ ఉద్యమంలో ప్రతీ ఊరువాడను ఉర్రూతలూగించాయి. తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరికి ‘దళిత బంధు’ ఉద్దేశం తెలిపేందుకుగాను గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్‌తో పాటలు కట్టిస్తున్నట్లు సమాచారం. తద్వారా ప్రతీ ఒక్కరికి ‘దళిత బంధు’ గొప్పతనం తెలుస్తుందని సీఎం భావిస్తున్నారు. పాట గొప్పతనం తెలిసినందువల్లే సీఎం కేసీఆర్ ఈ ప్రయోగానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో సరికొత్త ‘దళిత బంధు’ గానం రాబోతున్నదా? అనే ప్రశ్నకు అధికార పార్టీ వర్గాలు అవుననే సమాధనమే ఇస్తున్నాయి. ఈ పాటలతో ఒకప్పటి ఉద్యమ అనుభూతులను, జ్ఞాపకాలను మళ్లీ స్వరాష్ట్రంలో గుర్తుచేసుకునే అవకాశం లభిస్తుంది.