జనాల్లోకి జగన్: అదే జరిగితే… బూడిదలో పోసిన పన్నీరే!  

-

“నేను విన్నాను.. నేను ఉన్నాను” అని తన పాదయాత్రలో వైఎస్ జగన్ చెప్పగానే జనం బలంగా నమ్మారు.. అదే స్థాయిలో అత్యంత బలంగా గెలిపించారు. కొత్తరకం పాలన అందుతుందని, సామాన్యుడు సంతృప్తిపడే పాలన రాబోతుందని అంతా కలలుగన్నారు. మరి అలాంటి పాలన వచ్చిందా? ఇంకా రావాల్సి ఉందా? పాలనలో లోపాలు ఎక్కడున్నాయి? గ్రామాల్లోని సామాన్యుడి గోడు తాడేపల్లి వరకూ వినిపిస్తుందా? వినిపించాలంటే జగన్ ఏమిచేయాలి? ఎలా చేయాలి? ఇప్పుడు చూద్దాం…!

Ys-Jaganmohan-Reddy
Ys-Jaganmohan-Reddy

“జగన్ పాలన బాగుంది.. జగన్ పాలన బాగానే ఉంది.. జగన్ పాలన బాగాలేదు.. గతపాలకులే బెటర్.. ” ఇలాంటి రకరకాల కామెంట్లు ప్రస్తుతం జగన్ పాలనపై ఏపీలో వినిపిస్తున్నాయి. కరోనా కాలంలో కూడా జగన్ సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గకపోవడంపై అభినందనలు వెళ్లువెత్తుతున్నప్పటికీ.. ఆ సంతృప్తిని కంటికి కనిపించని, తాడేపల్లికి వినిపించని అసంతృప్తి డామినేట్ చేస్తుందనే కామెంట్లు తాజాగా మొదలయ్యాయి!

సామాన్యుడి బ్రతుకులు మారాలంటే.. సంక్షేమ పథకాలు అనేవి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అని జగన్ కూడా గ్రహించలేదనేది మరో విమర్శ! సామాన్యుడి బ్రతుకు చిత్రం మారాలంటే ఫస్ట్ ఎయిడ్ అవసరమే కానీ.. అది మాత్రమే అవసరం కాదు! అభివృద్ధి పక్కాగా జరగాలి.. యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్స్ యొక్క అసలు ఉద్దేశ్యం తప్పుదోవపడుతుందన్న కామెంట్లు కూడా జగన్ వినాలి.. వినిపించుకోవాలి!

ఈ విషయాలపై అవగాహన కల్పించుకోవడానికి, సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి అని జగన్ మళ్లీ జనాల్లోకి రాబోతున్నారు! అవును… తన పాల‌న‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ “రచ్చబండ” పేరుతో రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌కు బయలుదేరబోతున్నారు. ఇందులో భాగంగా… గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేయనున్నారు. ఈ మేర‌కు డిశెంబరు మొదటివారం నుంచి కానీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు! అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇక్కడ జగన్ గమనించాల్సిన విషయం ఒకటుంది!

సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నట్లు కనిపిస్తున్నా.. నిజమైన అర్హుల్లో కొందరికి అవి అందడం లేదు! ఆ సంగతి అలా ఉంటే… కేవలం సంక్షేమ పథకాల అమలే పాలన కాదన్న విషయాన్ని జగన్ గ్రహించాలనేది పలువురి సూచన. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య! ఆ సమస్యలను నేరుగా జగన్ తెలుసుకోవాలనుకోవడం మంచి ఆలోచనే అయినప్పటికీ… అది ప్రీ ప్లాన్డ్ గా ఉంటే మాత్రం ప్రయోజనం శూన్యం అని జగన్ మరువకూడదు.

ప్రస్తుతం జగన్ సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్న సమయంలో.. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చువల్ మీటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో సంక్షేమ పథకాల అర్హుల్లో ఒకరిద్దరు ఆన్ లైన్ లో జగన్ తో మాట్లాడుతుంటారు. అది పూర్తిగా ప్రశంసా పత్రం చదువుతున్నట్లుగానే ఉంటుంది! ఆ పొగడ్తలు వాస్తవాలు కూడా అవ్వొచ్చు. కానీ అలాంటి కార్యక్రమాలే “రచ్చబండ”లో కూడా జరిగితే మాత్రం.. జగన్ ఆశించిన ఫలితాలు, రచ్చబండ కార్యక్రమం అసలు ఉద్దేశ్యం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

ఈ విషయాలను స్థానిక నాయకులు కచ్చితంగా గ్రహించుకోవాలి. తమ లోపాలు జగన్ వరకూ చేరతాయేమోనన్న భయంలో డబ్బారాయుళ్లను మాత్రమే రచ్చబండలో భాగస్వాములను చేస్తే అది జగన్ కు ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందన్నది సత్యం!! అపుడు జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా.. ఆ సంతృప్తిని అసంతృప్తి కచ్చితంగా డామినేట్ చేస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!

Read more RELATED
Recommended to you

Latest news