హుజూరాబాద్ ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెలపడుతుండటంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎదురువుతున్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కి బహిరంగ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ. 20 వేలు ఇస్తుందని, అందులో రూ. 5 వేలు నొక్కేసి 15 వేలు ఇస్తున్నారంటూ బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని గంగుల కమలాకర్ విమర్శించారు. దీనిపై భాగ్యలక్ష్మీ ఆలయంలోనే తేల్చుకుందాం అని అన్నారు. ఎవరిది తప్పైతే వారిని అమ్మవారు శిక్షిస్తారని గంగుల అన్నారు. నోరు తెరిస్తే బండి సంజయ్ కి అబద్దాలే వస్తాయని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ కిట్ లో, గ్యాస్, పెట్రోల్ సబ్సిడీలో బండి సంజయ్ ఇలాగే అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. రైతుల ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అని, అలాంటిది కేంద్రం ప్రస్తుతం ధాన్యాన్ని కొనుగోలు చేయమని స్వయంగా కేంద్రమంత్రే లిఖిత పూర్వకంగా తెలియజేశారని గంగుల తెలిపారు. కానీ రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. బీజేపీ చెప్పే మాటలను రైతులు, హుజూరాబాద్ ప్రజలు నమ్మవద్దని సూచించారు. హుజూరాబాద్ ప్రజలను ఈటెల రాజేందర్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. బీజేపీ హుజూరాబాద్ లో ఓడిపోతుందనే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని గంగుల విమర్శించారు.
బండి సంజయ్ కి గంగుల సవాల్.. భాగ్యలక్ష్మీ ఆలయంలోనే తేల్చుకుందాం.
-