హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. మెట్రో రైల్ నడిచే వేళల్లో మార్పు చేస్తూ హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాత్రి 10:15కు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైల్ బయలుదేరనుంది. చివరి మెట్రో రైల్ రాత్రి 11:15 కు గమ్య స్థానం చేరనుంది. ఇటీవల మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హెచ్ఎంఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఓ ప్రయాణికుడు ట్విట్టర్లో తన సమస్యను మంత్రి కేటీఆర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వచ్చే ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఉదయం 7 గంటల కన్నా ముందే మెట్రో స్టేషన్లకు చేరుకుని వెయిట్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారంటూ కేటీఆర్ కు ట్విట్ చేశాడు. దయచేసి మెట్రో రైల్ సేవలు ఉదయం 6 గంటలకే ప్రారంభయ్యేలా చర్యలు తీసుకోవాలని, గంట సేపు మెట్రో స్టేషన్లో వెయిట్ చేయలేక ఇబ్బంది పడుతున్నామని, ఉదయం సమయాల్లో క్యాబ్‌లలో వెళ్లాలంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ట్వీట్ ద్వారా సదరు నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడు. దీనికి సమాధానంగా నెటిజన్ అభ్యర్థనను అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఈ విషయంపై ఆలోచించాలని హైదరాబాద్ మెట్రో ఎండీని ట్యాగ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో ఎండీ స్పందిస్తూ.. తప్పకుండా సర్ అంటూ కేటీఆర్ ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. దీంతో హైదరాబాద్ మెట్రో సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి.