ముడి బియ్యం, స్టీమ్ రైస్‌కు మధ్య తేడా ఏమిటి? ఎందుకింత లొల్లి

-

రాష్ట్రంలో వడ్ల కొనుగోలు అంశం చిలికిచిలికి గాలి వానలా మారుతున్నది. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కేంద్రం వడ్లను కొనుగోలు చేయనంటుంది. అందుకే, యాసంగిలో వరిని పండించవద్దని సీఎం సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముడి బియ్యం కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొంటున్నారు. పారా బాయిల్డ్ లేదా స్టీమ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయనన్నదని తెలిపారు. అసలు ముడి బియ్యం, పారా బాయిల్డ్ లేదా స్టీమ్ రైస్‌కు తేడా ఏమిటీ? రాష్ట్రంలో నెలకొన్న వివాదం ఏమిటో చూద్దాం!

బియ్యంలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ముడి బియ్యం(రా రైస్), స్టీమ్ రైస్(పారా బాయిల్డ్ రైస్). రైతులు నేరుగా మిల్లులో పట్టించే బియ్యం లేదా చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం ముడి బియ్యం రకానికి చెందినవి. ఈ బియ్యంలో చేతులు పెడితే తెల్లటి పొడి లాంటి పదార్థం ఉంటుంది. వీటికి లక్కపురుగు, తెల్లపురుగు పడుతాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. త్వరగా జీర్ణమవుతాయి. ముడి బియ్యాన్ని త్వరగా వినియోగించకపోతే త్వరగా లక్కపురుగు, తెల్లపురుగు పడటం వల్ల వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే, వీటి పట్ల అనాసక్తి చూపుతుంటారు.

పారాబాయిల్డ్ రైస్‌లో ఎలాంటి తెల్లటి పొడి లాంటి పదార్థం ఉండదు. ఇవి నిస్సారమైన బియ్యం. వీటిని కడిగినప్పుడు కలి లేత పసుపు రంగులో వస్తుంది. పారా బాయిల్డ్ రైస్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు. జీర్ణం కూడా సరిగ్గా కాదు. అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ రైస్ ఎక్కువ కాలం నిలువ ఉండటం వల్ల వీటిని పండించడం పెరిగింది. గత ఎనిమిదేళ్లుగా ఎక్కువగా పండిస్తున్నారు.

రైతులు వరిని మాత్రమే పండిస్తారు. ప్రత్యేకంగా రా రైస్, బాయిల్డ్ రైస్ అని పండించరు. అయితే, రా రైస్ మిల్లులో క్వింటాలుకు 60 నుంచి 65 కిలోలు వస్తాయి. పారా బాయిల్డ్ రైస్ 70 కిలోలకు పైగా వస్తుంది. ఇది మిల్లర్లకు కలిసొచ్చే అంశం కావడం గమనార్హం.

దేశంలో రైస్ ప్రొక్యూర్‌మెంట్ చేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ముడి రైస్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నదని, పారా బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయనన్నదని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో కూడా పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయనని స్పష్టం చేసిందని చెబుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం రైస్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేదని టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. అందుకే యాసింగిలో వరి పండించే నష్టపోవద్దని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news