వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కోమటిగూడెంలో విషాదం చోటుచేసుకుందిm అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే…. కోమటి గూడెం గ్రామానికి చెందిన లావణ్య అనే యువతి తమ ఇంటి ఎదురుగా ఉన్న ముప్పిడి నరేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరి కులాలూ ఒక్కటే కావడంతో పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించారు. అంతేకాకుండా పెళ్లి సమయంలో ఎకరం పొలం, ఐదు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు కూడా ఇచ్చారు. 11 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొంతకాలం ఎలాంటి సమస్యలు లేకుండా అత్తింటి వారు బాగానే చూసుకున్నారు.
కానీ కొంత కాలంగా భర్త అత్తింటివారు వేధిస్తున్నారని లావణ్య కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీలో ఇకనుండి తన భార్యను బాగానే చూసుకుంటానని నరేష్ హామీ ఇచ్చాడు. కానీ మళ్ళీ గొడవ జరగడంతో లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో లావణ్య మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే నరేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంట్లో నుండి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.