తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన… అన్నదాతల్లో గుబులు

-

వరసగా వస్తున్న అల్పపీడనాలు, వాయుగుండాలు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నాయి. తాజాగా వర్షాల కారణంగా రాయలసీమ అతలాకుతలం అయింది. దాదాపు 20కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇటీవల ఏర్పడిన వాయుగుండం..అల్పపీడనంగా మారింది. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తాజాగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వర్షాలు కలవరపెడుతున్నాయి. రాగల 48 గంటల్లో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే శుక్రవారం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ చెదురుముదురు వానలు కురుస్తున్నాయి. నారాయణపేట, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్‌, ఖమ్మం, సంగారెడ్డి, భువనగిరి లతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కాగా తెలంగాణలో ప్రస్తుతం వరి ధాన్యం కోత, కల్లాల్లో ధాన్యం ఉంది. దీంతో వర్షాలు కురిస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యం తడిసి మొలకలు ఎత్తే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాల కారణంగా అన్నదాతల్లో గుబులు ఏర్పడింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news