వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభం అయింది. ఇందు కోసం ఈనెల 24న కేంద్ర కేబినెట్ కీలక భేటీ నిర్వహించనుంది. రైతు చట్టాలకు వెనక్కి తీసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తీర్మాణం ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ అధికారికంగా మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రైతులను ఇబ్బందులు పెట్టినందుకు ప్రధాని మోదీ క్షమాపణలు కూడా చెప్పారు. ఈనెల 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో కేబినెట్ భేటీలో చట్టాలకు రద్దుకు సంబంధించి తీర్మాణం ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు మూడు వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేవరకు పోరాటం ఆపేది లేదంటూ రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతు వ్యతిరేఖ చట్టాలతో పాటు విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. ఈనెల 26న దేశ రాజధానిలో ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. రాష్ట్రాల రాజధానుల్లో కూడా ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని రైతులను కోరారు.