ప్రశాంత్ కిషోర్..పీకే…రాజకీయాలు గురించి తెలిసినవారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే టాప్‌లో ఉన్న పీకే…అనేక మంది నేతలకు గొప్ప విజయాలు అందించారు. ఎన్నికల సమయంలో తన వ్యూహాలతో అనేకమంది నాయకులని గెలిపించారు. తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టేవారు. పీకే స్ట్రాటజీలతోనే జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ లాంటి వారు గద్దెనెక్కారు.
అందుకే ఆయన వ్యూహాలని వాడుకోవడానికి నాయకులు పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం…ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే ముందుకెళుతున్నారని ప్రచారం జరుగుతుంది. అధికారికంగా కాకపోయినా, అనధికారికంగా కేసీఆర్, పీకే స్ట్రాటజీ ప్రకారమే రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్, బీజేపీ నేతల మధ్య ఎలాంటి వార్ నడుస్తోందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో…కేసీఆర్ సడన్‌గా వ్యూహం మార్చి…తానే స్వయంగా రంగంలోకి దిగి బీజేపీని టార్గెట్ చేసి తెగ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అంశంలో పూర్తిగా బీజేపీని టార్గెట్ చేసి ప్రజల్లో నెగిటివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇలా కేసీఆర్ చేయడం వెనుక పీకే ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇటీవల కేసీఆర్, ప్రశాంత్ కిషోర్‌ను కలుస్తున్నారని.. పీకే డైరెక్షన్ లోనే కేసీఆర్ ఆందోళనలు, భౌతిక దాడులకు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్‌కు పీకే వ్యూహాలు తీసుకునే అవసరం ఉందా? అసలు కేసీఆరే పెద్ద వ్యూహకర్త. మరి అలాంటప్పుడు ఆయనకు కూడా పీకే అవసరం పడిందా? అంటే పరిస్తితులని చూస్తే అదే నిజమే అనిపిస్తోంది.
బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో కేసీఆర్..పీకేని ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది. పైగా ఎప్పుడూలేని విధంగా తెలంగాణలో కూడా బూతులు, దాడుల రాజకీయం నడుస్తోంది. ఏపీలో ఇదే తరహా రాజకీయం నడుస్తోంది. అక్కడ అధికార వైసీపీకి పీకే సపోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే ఇక్కడ కూడా పీకే ఎంట్రీ ఇచ్చినట్లే కనిపిస్తోంది.