వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. 2024లో తిరిగి కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాల్సిందే. ఎందుకంటే.. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో నాలుగింటిలో కాషాయ పార్టీ అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రవాది గోమంత్రిక్ పార్టీ(ఎంజేపీ) బీజేపీకి షాక్ ఇచ్చింది. వచ్చే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో బీజేపీ, మహారాష్ట్రవాది గోమంత్రిక్ పార్టీ కలసి పోటీ చేశాయి. ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో కలసి పోటీ చేయడం కోసం ఎంజీపీ ప్రీ పోల్ అలయెన్స్‌ను కుదుర్చుకున్నది. సోమవారం విలేకరుల సమావేశంలో పొత్తు విషయమై ఎంజేపీ అధ్యక్షుడు దీపక్ ధవల్కిర్ ప్రకటన చేశారు. 12 అసెంబ్లీ సీట్లను ఇవ్వడానికి తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించింది. అన్నీ సవ్యంగా జరిగితే డిసెంబర్ 13న మమతా బెనర్జీ పర్యటన రోజునే పొత్తుపై సంయుక్త ప్రకటన వెలువడుతుందని ధవల్కిర్ తెలిపారు.