టీ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. సభ్యత్వ నమోదు కోసం కోడంగల్ వచ్చిన ఆయన రెండు పార్టీలపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పంటలను అమ్ముకునే దిక్కు లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సాగు చేసిన పంటలను అమ్ముకోలేక.. కేంద్ర, రాష్ట్ర విధానాలతో విసుగు చెంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. పార్లమెంట్ లో నిరసనల పేరుతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీల ఎంపీలు దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కానీ ఎంపీలు మాత్రం రైతుల సమస్యలను ప్రస్తావించకుండా బయటకు రావడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. తూతూ మంత్రంగా నిరసన కార్యక్రమాలు చేసి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు.