కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నాయకుడు,తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ఓటుకు నోటుకు దొరికిన రేవంత్ రెడ్డిని సంఘం నుంచి బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు గుత్తా. ఇటీవల ముగిసిన శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలకు అభినందనలు చెప్పారు గుత్తా.
నల్గొండ జిల్లాలో పార్టీలకతీతంగా ఇతర పార్టీల స్థానిక ఓటర్లు టిఆర్ఎస్ కు మద్దతు తెలిపారని.. కింద పడినా మాదే పై చేయి అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని చురకలు అంటించారు. వ్యక్తిగతంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలను ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ధాన్యం విషయంలో బిజెపి ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థమైందన్నారు. బ్యాంక్ లు, ఎల్ ఐసి, బీఎస్ఎన్ఎల్ సహా ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ కు అప్పజెబుతున్నారని.. మోడీ హయాంలో మొత్తం ప్రయివేట్ కు అప్పజెబుతున్నారని మండిపడ్డారు.