బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హన్మకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో 10 సంవత్సరాలు విధ్వంసం సృష్టించిన కేసీఆర్.. మళ్లీ ప్రజలను ఓట్లు అడగటం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఓటమి తర్వాతనైనా కేసీఆర్‌లో మార్పు వస్తుందని ఆశించాం.. రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని భావించాం.. కానీ, కేసీఆర్‌లో ఎలాంటి మార్పు రాలేదు అని మండిపడ్డారు.3 నెలలకే ఈ ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడటం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగపోవడానికి నేనేం అల్లాటప్పాగా రాలేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమం పేరు చెప్పి పిల్లలను చంపి పదవిలోకి రాలేదు. కష్టపడి పైకి వచ్చానని రేవంత్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు భారీ పరిశ్రమలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.