కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ యూకేలో కల్లోలం కలిగిస్తోంది. ముఖ్యంగా ఆదేశంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు యూకేలోనే వస్తున్నాయి. ప్రపంచంలో తొలి ఓమిక్రాన్ మరణం యూకేలో నమోదైంది. అయితే ప్రస్తుతం అక్కడ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఓమిక్రాన్ బారిన పడిన 7 గురు మరణించారు. యూకేలో రికార్డు స్థాయిలో 24,968 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఓమిక్రాన్ విషయంలో మొదట.. స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి.. మరణాలు లేవు అని అనుకుంటున్న దశలో.. మరణాలు సంభవిస్తుండటం అందర్ని కలవరపరుస్తోంది.
ఇదిలా ఉంటే యూకేతో పాటు ఇతర యూరోపియన్ దేశాల్లో ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగానే ఉంది. డెన్మార్క్ లో 11,589 కేసులు నమోదవ్వగా.. నార్వేలో 2060 కేసులు నమోదయ్యాయి. మిగతా దేశాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇదిలా ఉంటే నెదర్లాండ్స్ లో లాక్ డౌన్ మరో 14 రోజులు పొడగించారు. ఓమిక్రాన్ భయాలతో క్రమంగా ఇతర దేశాలు కూడా లాక్ డౌన్ పరిస్థితుల్లోకి వెళ్లుతున్నాయి.