సీఎం కేసీఆర్‌ కు రేవంత్‌ బహిరంగ లేఖ…వారికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే

-

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గడచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణ మృదంగం మోగుతోందని.. అధికారికంగానే నిత్యం ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట నష్టం జరిగిందనో, అప్పుల భారం మోయలేకనో నిస్సహాయ స్థితిలో పురుగుల మందు తాగినో ఉరి వేసుకొని బలవుతున్నారని మండిపడ్డారు.

revanth-reddy-cm-kcr

ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా, మరో వైపు మిర్చీ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని.. నెలల తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తోన్న రైతు హఠాత్తుగా శవమై కనిపిస్తోన్న దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే… తాజాగా మిర్చీ రైతుల మెడలకు బిగుసుకుంటోన్న ఉరితాళ్లు కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల ప్రాణాలకు గడ్డిపోచ కంటే హీనంగా లెక్క గట్టే పాలనలో తెలంగాణ ఉందని.. మిర్చీ రైతుల చావు కేకలు మీకు వినిపించడం లేదా…!? అని ప్రశ్నించారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన మిర్చీ రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలని…తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని.. మిర్చీ రైతుల్లో భరోసా నింపేందుకు తక్షణం మంత్రుల బృందం క్షేత్రానికి వెళ్లాలని లేఖలో పేర్కొన్నారు. రూ. లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేయాలని ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news