తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. విపత్తుల చట్టం టీఆర్ఎస్ కు వర్తించదా… మంత్రి కేటీఆర్ కు వర్తించదా ..? అని ప్రశ్నించారు. ఇదే విధంగా టీఆర్ఎస్ నేతలని అరెస్ట్ చేస్తే… జైలు కూడా సరిపోవని ఆయన అన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఓ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడి కార్యాలయంపై పోలీసులు ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. పోలీసుల చర్యలకు సిగ్గుతో తలదించుకోవాలని ఆయన అన్నారు. పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారుతుందని అనుకోలేదని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే రకంగా హౌజ్ అరెస్ట్ లు చేస్తే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో రైతు ఉద్యమం జరిగితే మా ప్రభుత్వం ఎంతో సంయమనం పాటించిదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ దివాళాకోరుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ పాలనను, మమతా బెనర్జీ ఫార్ములాను అనుసరిస్తుందని విమర్శించారు. అయితే ఇది తెలంగాణ గడ్డ అని ఇక్కడ మీ ఆటలు సాగవని హెచ్చరించారు. నియంత్రుత్వానికి వ్యతిరేఖంగా, రజాకారులకు వ్యతిరేఖంగా పోరాడిన గడ్డ అని అన్నారు. తెలంగాణలో కుటుంబ రాజ్యాంగం, కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని ఆయన విమర్శించారు.