స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ అని పాడుకున్న రోజుల నుంచి ఇప్పటిదాకా చిరు అంటే ఎందరికో గౌరవం మరియు అభిమానం. ఆయన మాట చాలా మందికి వేదవాక్కు.ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఆయన్నొక హీరోలా కాకుండా గాడ్ ఫాదర్ లా చూస్తారు. అదే ఆయన వ్యక్తిత్వానికి తార్కాణం. ముందు నుంచి ఆయన అందరినీ కలుపుకునే తత్వం, గెలుపు ఓటములతో తేడాలేకుండా కష్టపడే తత్వంను ప్రేమించడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ శాతం మందికి చేరువ చేశాయి.అదే ఇవాళ జగన్ దగ్గర కూడా మంచి మార్కులు దక్కేలా చేశాయి. ఇండస్ట్రీ పెద్దను కాను బిడ్డను నేను అని పదే పదే విన్నవించి మరీ! ప్రభుత్వం దగ్గరకు చర్చల నిమిత్తం వెళ్లిన చిరు చాలా వరకూ అనుకున్నవి సాధించారనే చెప్పాలి. చిన్న చిత్రాలకు పెద్ద సాయం చేసిన చిరుకూ పెద్ద అన్న పదం నచ్చదు కానీ ఇండస్ట్రీ పెద్ద దిక్కుగానే ఆయన ఇవాళ మారారు అన్నది సుస్పష్టం.
ఇటీవల ఆడియో ఫంక్షన్లలో అదేవిధంగా ప్రీ రిలీజ్ వేడుకల్లో చాలామంది కట్టు తప్పి మాట్లాడుతుండడం వల్ల ఇండస్ట్రీకి అనేక సమస్యలు వస్తున్నాయి.దీంతో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను అస్సలు సడలించుకోవడం లేదు. కొన్నిసార్లు ఆ నిర్ణయాలు విషయమై పునరాలోచనే లేదని కూడా అంటున్నాయి.తాజాగా సీఎం జగన్ తో చిరు చర్చల నేపథ్యాన అన్నీ శుభ శకునాలే వెల్లడి కానున్నాయన్నది స్పష్టం అయింది. ఈ దశలో ఏ వేడుకల్లోనూ ఎక్కడా కూడా నోరు జారవద్దని చిరు పదే పదే విన్నవిస్తూ హెచ్చరిస్తూ ఇవాళ మీడియా ఎదుట మాట్లాడారు. ఇవి ఏ మేరకు ప్రభావితం చేయనున్నాయో అన్నది ఇప్పుడిక ఆసక్తిదాయకం.
ఇండస్ట్రీలో ఎవ్వరూ నోరు జారవద్దు అంటూ చిరంజీవి ఇవాళ సున్నితంగా హెచ్చరించారు.సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తున్నానని మరో మారు చెప్పారు. ఈ దశలో ఎవ్వరూ హద్దు దాటి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయరాదని ఉద్ఘాటించారు. రెండో కోణం కూడా తెలుసుకునేందుకే జగన్ తనను ఆహ్వానించారని కూడా చెప్పారు.ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వనున్నాయని త్వరలోనే రెండు మూడు వారాల్లో ఏంటన్నది తెలిసి పోతుందని అన్నారు. అంతా శుభవార్తలే వింటారని కూడా చెప్పారు.