మ‌రోసారి మోడీ ప్ర‌ధాని అవుతారా..? ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆస‌క్తి స‌ర్వే..!

-

రాహుల్ క‌న్నా మోడీ ప్ర‌ధాని అయితేనే దేశాన్ని బాగా ముందుకు న‌డిపిస్తార‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. స‌ర్వేలో భాగంగా 52 శాతం మంది ప్ర‌జ‌లు మోడీ ప‌క్షాన నిల‌వ‌గా, రాహుల్ గాంధీ ప‌క్షాన కేవ‌లం 27 శాతం మంది మాత్ర‌మే నిలిచారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు నిన్న షెడ్యూల్ విడుద‌లైన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా ఆయా జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌లో నిమ‌గ్న‌మ‌య్యాయి. మొత్తం 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి దృష్టి ఇద్ద‌రు ముఖ్య నేత‌ల‌పై ప‌డింది. వారే ప్ర‌ధాని మోడీ.. రాహుల్ గాంధీ.. వీరిద్ద‌రిలో ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఎవ‌రు ప్ర‌ధాని అవుతారోన‌ని అంత‌టా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఈ ఇద్ద‌రి గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ తాజాగా స‌ర్వే నిర్వ‌హించింది. అందులో షాకింగ్ ఫ‌లితాలు వ‌చ్చాయి.

ప్ర‌ధాని మోడీ, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత రాహుల్ గాంధీలు ఇద్ద‌రికీ.. ఎంతెంత గ్రాఫ్ ఉందో తెలుసుకునేందుకు ప్ర‌ముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఫిబ్ర‌వ‌రి 5 నుంచి 21వ తేదీల మ‌ధ్య స‌ర్వే నిర్వ‌హించింది. మొత్తం 690 ప్ర‌దేశాల్లో 14,432 మందిని ప్ర‌శ్న‌లు అడిగి స‌మాధానాలు రాబ‌ట్టారు. త‌రువాత వాటిని విశ్లేషించారు. ఈ క్ర‌మంలో తేలిందేమిటంటే.. రాహుల్ క‌న్నా మోడీ ప్ర‌ధాని అయితేనే దేశాన్ని బాగా ముందుకు న‌డిపిస్తార‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

స‌ర్వేలో భాగంగా 52 శాతం మంది ప్ర‌జ‌లు మోడీ ప‌క్షాన నిల‌వ‌గా, రాహుల్ గాంధీ ప‌క్షాన కేవ‌లం 27 శాతం మంది మాత్ర‌మే నిలిచారు. అయితే పుల్వామా దాడి ఘ‌ట‌న త‌రువాతే అనూహ్యంగా మోడీ పుంజుకున్నార‌ట‌. ఒక్క‌సారిగా ఆయ‌న రేటింగ్ 7 శాతం పెరిగింద‌ట‌. దీంతో మోడీ అయితేనే దేశాన్ని బాగా అభివృద్ది చేస్తూ ముందుకు తీసుకుపోతార‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక ఎన్‌డీఏ ప్ర‌భుత్వానికి చెందిన ఎన్నిక‌ల హామీల విష‌యానికి వ‌స్తే మోడీ త‌మ హామీల‌ను అమ‌లు చేయ‌డంలో వెనుక‌బ‌డ్డార‌ని ప్ర‌జ‌లు చెప్పారు. ఇక ఇటీవ‌లే ప్ర‌వేశ‌పెట్టిన కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం వ‌ల్ల పెద్ద ఉప‌యోగం ఏమీ లేద‌ని ప్ర‌జ‌లు చెప్పారు. అంటే.. ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చ‌లేక‌పోయినా, జీఎస్‌టీ, నోట్ల రద్దు, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌.. వంటి ప్ర‌తికూల అంశాలు ఉన్నప్ప‌టికీ.. స‌ర్జిక‌ల్ దాడుల‌తో పాక్‌కు మోడీ ప్ర‌భుత్వం గ‌ట్టిగా బుద్ధి చెప్పిన విధానం ప‌ట్ల ప్ర‌జ‌లు సానుభూతితో ఉన్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ నేత‌లు కూడా ఇదే నినాదంతో ముందుకు వెళ్తార‌ని తెలుస్తోంది. మ‌రి స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల మాదిరిగానే మోడీ రానున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసి మ‌రోసారి ప్ర‌ధాని అవుతారా, లేదా అన్న‌ది తెలియాలంటే.. మే 23వ తేదీ ఓట్ల లెక్కింపు వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news