ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు పట్టు ఉంది..అలాగే జిల్లాలో ఉన్న పలు నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్నాయి. అందులో తుంగతుర్తి సైతం కాంగ్రెస్‌క కంచుకోట. మొదట నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సత్తా చాటుతుంది. ఈ నియోజకవర్గంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే 2009లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వడ్ స్థానంగా మారింది. దీంతో రాంరెడ్డి, పక్కనే ఉన్న సూర్యాపేటకు మారారు. ఇక తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్‌ని నడిపిస్తున్నారు. ఇక గత రెండు ఎన్నికల్లో అద్దంకి చాలా తక్కువ మెజారిటీలతో ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండు సార్లు దాదాపు 2 వేల ఓట్ల మెజారిటీలతోనే ఓడిపోయారు. కానీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు.
తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి అద్దంకిపై ఉంది. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై వ్యతిరేకత పెరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నేతలు ఐకమత్యంగా పనిచేయకుండా, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ధోరణిలో ముందుకెళుతున్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి మళ్ళీ తుంగతుర్తిపై ఫోకస్ చేసి సెపరేట్‌గా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్సీ స్థానమైన సరే…తనకు అనుకూలమైన వ్యక్తిని ఇక్కడ నిలబెట్టాలని చూస్తున్నారు.
దీంతో అద్దంకికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అలాగే అద్దంకి దయాకర్ కేవలం ఎన్నికల సమయంలోనే నియోజకవర్గంలోని వస్తారని, తర్వాత మళ్లీ కనిపించరని రాంరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇక తనను నియోజకవర్గంలో తిరగనివ్వకుండా దామోదర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అద్దంకి దయాకర్ ఆరోపిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య రచ్చతో తుంగతుర్తిలో కాంగ్రెస్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. ఈ పోరుకు రేవంత్ రెడ్డి చెక్ పెట్టాలి లేదంటే గెలిచే తుంగతుర్తిలో కాంగ్రెస్ మళ్ళీ ఓడిపోవడం గ్యారెంటీ.