తెలంగాణ రాష్ట్ర హై కోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులే నిర్వహించాలని కేసీఆర్ సర్కార్‌ను ఆదేశించింది హై కోర్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, ఆన్ లైన్ క్లాసుల పై దాఖలైన పిటీషన్ ను హై కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ కు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు. విద్యా సంస్థల్లో ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని అదేశించింది.
ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కొనసాగించాలన్న హైకోర్టు… హైదరాబాద్ లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలన్న హైకోర్టు.. సమ్మక్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని ఆదేశించింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి తెలిపిన హైకోర్టు.. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది హై కోర్టు.