కేంద్రంతో కయ్యానికి సిద్ధం అవుతున్న కేసీఆర్
కొత్త తరహా రాజకీయం తెస్తానంటున్నారు
మోడీతో విభేదం పెంచుకుని జాతీయ స్థాయిలో
బీజేపీయేతర శక్తులతో కలిసి పోరాడుతానని అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పంథా మార్చడంతో రాజకీయంలో అనూహ్య మార్పులకు తెరలేచింది. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేస్తున్న ప్రకటనల కారణంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రభావితం చేసేందుకు యోచిస్తున్నారు. ఇప్పటికే తనదైన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఆయన చంద్రబాబుతో వెళ్లనున్నారా లేదా జగన్ తో వెళ్లనున్నారా అన్నదే ఇంకా తేలలేదు. కానీ జాతీయ స్థాయిలో తన రాజకీయ ప్రయాణం సాగించేందుకు ఇప్పటి నుంచే కొన్ని ప్రణాళికలు అయితే వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మొన్నటి మీడియా మీట్ లో కొన్ని ఆసక్తిదాయక మాటలు చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల వేళ వివిధ పార్టీలతో కలిసి ముందుకువెళ్లాలని యోచిస్తున్నారు. దేశ ప్రగతి అన్నది బీజేపీతో సాధ్యంకాదని కూడా తేల్చేస్తున్నారు. ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడే కానీ ఆయనకు జాతీయ స్థాయిలో ఎవరు మద్దతు ఇస్తారు అన్నదే సందేహాస్పదంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ జాతకం ఏంటోతేలిపోనుంది. అటుపై కొన్ని ప్రాంతీయ పార్టీలు
స్టాలిన్ నేతృత్వంలో కూటమిగా మారేందుకు అవకాశం ఉంది. కూటమి పెద్దగా సోనియా ఉన్నా దక్షిణాది రాష్ట్రాల వరకూ స్టాలినే పెద్ద దిక్కు కానున్నారు. కేసీఆర్ ఆలోచన మాత్రం అటు కాంగ్రెస్ వైపు లేదు బీజేపీవైపు లేదు. కొత్త కూటమి ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ బలోపేతానికి కొడుకు కేటీఆర్ కు మరిన్ని బాధ్యతలు అప్పగించనున్నారు.
దేశ భవిష్యత్ కోసం తానొక కార్యకర్తగా పనిచేస్తానని కేసీఆర్ అంటున్నారు. బీజేపీని ఉద్దేశించి ఇదే సమయంలో ఎన్నో విషయాలు చెబుతున్నారు. గడిచిన 8ఏళ్లలో బీజేపీ సాధించిందేమీ లేదని స్పష్టం చేశారు. పన్నుల వసూళ్ల లో మాత్రం దక్షిణాది నుంచి అగ్రభాగం దక్కించుకుంటున్న కేంద్రం తరువాత మాత్రం ఇక్కడి రాష్ట్రాల అభివృద్ధి పై దృష్టి సారించడం లేదు అన్నది సుస్పష్టం అని లెక్కలతో సహా వివరించారు.ఆయన కోరుకుంటున్నది ప్రజాస్వామ్య పరివర్తన. ప్రజాస్వామ్య పరివర్తన నుంచే తెలంగాణ ఏర్పాటైందని, అలానే ఇప్పుడు కూడా అటువంటి ఉద్యమ స్ఫూర్తిని అందిస్తే ప్రజలు కదిలివస్తారని ఆయన అంటున్నారు. కేసీఆర్ ఆలోచనలు టీఆర్ఎస్ తో సక్సెస్ అయ్యాయి.అదే స్థాయిలో కూటమి రాజకీయాల్లో సక్సెస్ అవుతాయో లేదో మరి!