కేసీఆర్ కు జొర్రమొచ్చింది
తెలంగాణ ఇంటి పార్టీ పెద్ద కేసీఆర్ కు జొర్రమొచ్చింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద కేసీఆర్ కు జొర్రమొచ్చింది
దీంతో తనకు ఎంతో ఇష్టమయిన చిన జియరు స్వామి ఆశ్రమానికి వెళ్లలేకపోయారు. జగద్గురు రామానుజా చార్యుల విగ్రహావిష్కరణకు వచ్చిన నరేంద్ర మోడీ అనే ప్రధానిని కలవలేకపోయారు. అదేవిధంగా ఆయన ఆ రోజు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు. ఎందుకంటే ప్రధాని మోడీ అంటే కేసీఆర్ కు వణుకు అని అందుకే ఆయనకు చలి జ్వరం వచ్చి ఉంటుందని బీజేపీ పెద్దలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే తాము ఎవ్వరికీ భయపడి, వణికిపోవాల్సిన పని ఏమీ లేదని, తాము నిబద్ధతతో కూడిన పాలననే ప్రజలకు అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన కీలక నాయకులు మాట్లాడుతున్నారు.
తాము బీజేపీ మాదిరిగా ఇచ్చిన మాటను తప్పే మనుషులం కాదని, ప్రధానికి దళితులంటే ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా దళితబంధును అమలు చేసి చూపాలని, అసలైన సమానత్వానికి ప్రతినిధిగా టీఆర్ఎస్ సర్కారు ఉంటోందని చెబుతూ వివాదాన్ని మరింత పెంచారు సంబంధిత కేసీఆర్ మనుషులు. దీంతో ఇప్పట్లో ఈ మాటల యుద్ధం అయితే ఆగేలా లేదు.
ఇదీ వివాద సంవాద నేపథ్యం
ముచ్చింతల్ లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. కానీ కేసీఆర్ రాలేదు. కనుక ఇప్పుడు వివాదం రేగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తీరుపై, ప్రభుత్వ పెద్దగా ఉన్న కేసీఆర్ తీరుపై వివాదాలే రేగుతున్నాయి. బీజేపీ అదే పనిగా పెద్దాయనను టార్గెట్ చేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని అవమానించడం భావ్యం కాదని అంటోంది. అయితే గులాబీ దండు మాత్రం ప్రొటొకాల్ నిబంధనలకు సంబంధించి ఉన్న జీఓలను, వాటిపై గతంలో పీఎంఓ(ప్రధాని కార్యాలయం) చెప్పిన మాటలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో ఓ పెద్ద యుద్ధమే చేస్తోంది.వాస్తవానికి ప్రధాని ఓ ప్రయివేటు కార్యక్రమానికి వచ్చారు అని, దానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు.
రూల్స్ ప్రకారం..నిజమిదే!
ప్రధానికి ఓ ప్రయివేటు కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానికి సీఎం స్థాయి వ్యక్తులు ఎదురేగి స్వాగతం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని గతంలో పీఎంఓ చెప్పిందని పేర్కొంటూ కేసీఆర్ మనుషులు తమదైన వాదన ఒకటి ఆధార సహితంగా వినిపిస్తున్నారు. దీంతో వివాదం మరింత ముదిరింది. బండి సంజయ్ లాంటి పెద్దలు కేసీఆర్ కు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వివాదం ఇంకా పెరిగిపోయింది. తాము ఎవ్వరికీ భయపడేదే లేదని, తమ పని తాము చేసుకుంటూ పోతూ ప్రజాభీష్టం మేరకు సంక్షేమ పథకాలు అమలు చేయడమే ధ్యేయమని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలు.
– టాపిక్ ట్రాఫిక్ – మన లోకం ప్రత్యేకం