రాజకీయాల్లో తిరుగులేని నేతలంతా ఇంటి బాట పట్టే సమయం వచ్చినా కూడా చంద్రబాబు అనే సీనియర్ పొలిటీషియన్ మాత్రం ఉంటూనే ఉంటారు. పార్టీని నిలబెట్టే క్రమంలో కొంత.. అధికారం దక్కితే చాలు అన్న భావనలో కొంత ఆయన ఉన్నా కూడా నిరంతరం శ్రమిస్తారు. కొడుకు లోకేశ్ ఇప్పుడిప్పుడే రాజకీయాలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. జగన్ అనే సీఎంను ఎదుర్కోవడం కష్టం అయినా శ్రమిస్తున్నారు.
జగన్ మాదిరిగానే సానుభూతి రాజకీయాలు చేయాలనుకున్నా చేయలేరు కానీ కొంతలో కొంత పరిణితితో పనిచేస్తున్నారు. మద్యం అమ్మకాలు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి.. కల్తీ సారా అమ్మకాలు రాష్ట్రంలో ఎలా ప్రాణాలు తీస్తున్నాయి అన్నవి లోకేశ్ వివరించేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. వీటికే జే బ్రాండ్ లిక్కర్ అనే పేరు పెట్టారు. సారా ఏరులు పారుతున్నా కూడా పట్టించుకోని సీఎం అని లోకేశ్ మరియు చంద్రబాబు అంటున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
సభకు చంద్రబాబు రాకపోయినా సరే మీడియా లో ఫైట్ మాత్రం చేస్తున్నారు. ఆ విధంగా రాజకీయ చాణక్యత ఆయన ప్రదర్శిస్తున్నారు.ఈ దశలో రాష్ట్ర రాజకీయాల్లో సీ బ్రాండ్ అదే చంద్రబాబు బ్రాండ్ ఉందా ? ఆయన మార్కు అభివృద్ధిని వైసీపీ ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందా?
కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉంటాయి.. వాటికి సమాధానం వెతకలేం..కొన్నింటికి సమాధానాలు వచ్చినా అవి సంతృప్తిని ఇవ్వవు. ఇవ్వలేవు కూడా ! రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరున్న చంద్రబాబు ఆరోజు కేంద్రం నుంచి నిధులు తెచ్చారు. తాను అనుకున్న విధంగానే మూడు వేల కోట్ల రూపాయలతో అమరావతి పనులు చేశారు. పనులు కొన్ని బాగానే జరిగాయి. కొన్ని ఆగాయి. అయితే ఆగిన వాటిని కొనసాగించేందుకు వైసీపీ ఒప్పుకోవడం లేదు.
ఎందుకంటే అమరావతి అన్నది రియల్ వెంచర్ కనుక అందులో మాకు వాటాలు లేవు కనుక అన్న అర్థంలో వైసీపీ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా టీడీపీ వెంచర్ కనుక తాము ఎలా అభివృద్ధి చేసి, అభివృద్ధి ల్యాండ్ మార్క్ అమరావతి అని అనిపించుకునేలా ఎందుకని నిధులు వెచ్చిస్తామని అంటున్నారు వైసీపీ నాయకులు. అందుకే వైసీపీ బాస్ విశాఖ కేంద్రంగా రాజధాని అంటున్నారు. ఆ రోజు అమరావతి కారణంగా ఏడు వందల ఎకరాలకు పైగా చంద్రబాబుకు లాభం వచ్చిందని, అంతేకానీ ఆయన వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని వైసీపీ అంటోంది. అందుకే చంద్రబాబు బ్రాండ్ అభివృద్ధి లేనేలేదని తేల్చేస్తోంది.