గవర్నర్ తమిళిసైని కలిశారు తెలంగాణ బీజేపీ నేతలు. బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ టీఆర్ఎస్ వేధింపులు, ఇటీవల జరిగిన కామారెడ్డి జిల్లా తల్లికొడుకుల ఆత్మహత్యలు, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని కోరారు. రాష్ట్రంలో టీాఆర్ఎస్ నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తప్పుడు కేసులు పెడుతూ… కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కొన్ని కేసుల్లో స్వయంగా క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి… రాష్ట్ర పోలీసులు చేసే విచారణ సరిగా జరగదని… కేంద్ర సంస్థ సీబీఐతో విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. రాష్ట్రంలో వనమా వెంకటేశ్వరావు కుమారుడి విషయాన్ని, నిర్మల్ లో జరిగిన ఘర్షణలు, డబుల్ బెడ్రూం ఇంటి పేరుతో బాలికపై టీఆర్ఎస్ నేత అత్యాచారానికి పాల్పడటం వంటి అంశాలతో పాటు ఇటీవల జరిగిన ఖమ్మం, రామాయంపేట ఆత్మహత్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్లు రఘునందన్ రావు తెలిపారు. ఈ ఘటనలపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని… రాజ్యాంగ పరిరక్షణ చేయాలని, సామాన్యుడికి న్యాయం జరిగేలా గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని కోరినట్లు రఘునందన్ రావు వెల్లడించారు.