వామ్మో.. పాముల విషానికి అంత రేటా. తులం 40వేలా..!

-

పాములు అంటే భయపడని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. అవికనిపిస్తే ఇక పరుగెత్తుకోవటమే. ఆ దార్లోకి వెళ్లడానికి కూడా సాహసం చేయరు. ఇలా కొంతమంది ఉంటే..మరికొందరు పాములు అంటే పెద్దగా భయపడరు. కనిపిస్తే..దాన్ని చంపేవరకూ నిద్రపోరు. మనం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు చూశాం..కొందరు పాములతో ఆటలు ఆడతారు. సెల్ఫీలు సైతం తీసుకుంటున్నారు. పాములు పట్టేవాళ్లకు అయితే..అసలు పాము అంటే..భయమే ఉండదు. సరే పాయింట్ కి వచ్చేద్దాం..పాములు పట్టేవాళ్లు..పాము విషం తీసి అమ్ముకుంటున్నార‌ని తెలుస్తోంది. పాముల విషం ఏంటి, అమ్ముకోవ‌డం ఏంటి, అసలు దీంతో ఏం చేస్తారు అనే కదా మీ డౌట్..

పాము విషానికి అంత‌ర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. పాము విషాన్ని బంగారంలా తులాల చొప్పున అమ్ముతార‌ట. ‌పాముల్లోకెల్లా నాగు పాము విషానికి చాలా డిమాండ్ ఉంటుంద‌ని తేలింది. సంచార జాతుల వారు ఇలా పాముల విషాన్ని పడాతరు. వారి దగ్గరనుంచి తులం విషం 4వేలకు దళారులు కొంటారు.

వేలల్లో కొని లక్షల్లో అమ్మకం

ఇక దళారులు అయితే పాము విషాన్ని తులానికి 40 వేల చొప్పున విక్రయిస్తారని సమాచారం. ఈ లెక్కన లీటరు నాగుపాము విషం దేశీయ మార్కెట్ లో దాదాపు 40 లక్షలు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ ధర రూ.కోటి పైమాటేనట. అసలు కష్టం పాముల నుంచి విషం సేకరించిన వారిదే..అంతటి విలువైన విషాన్ని ప్రాణాలొడ్డి మరీ పాముల నుంచి కక్కించే పాములోళ్లు మాత్రం కూటికి లేని నిరుపేదలే. వాళ్ల దగ్గర నుంచి 4వేలకు కొని 40 వేళకు దళారులు అమ్ముతున్నారంటే..ఎంత దుర్మార్గమే..

అన్ని వ్యాపారాల కంటే ఈ బిజినెస్ చాలా లాభాల‌తో కూడుకున్న‌ద‌ని చాలామంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా స్నేక్ క్యాచ‌ర్స్ దీనిపై ఎక్కువ‌గా దృష్టి సారించారు. కానీ ఇది చ‌ట్ట‌విరుద్ద‌మైన ప‌ని. దీనివ‌ల్ల పాముల మ‌నుగ‌డ‌కు ముప్పు వాటిల్లుతుంది. ఇప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డ స్నేక్ క్యాచ‌ర్స్ ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు.

నాగుల నుంచే సేకరిస్తారట..

కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు తదితర విషం కలిగిన పాములున్నా.. పాములోళ్లు ఎక్కువగా.. నాగు పాముల్ని మాత్రమే పట్టుకుంటారు. ఎందుకంటే.. మన రాష్ట్రంలో నాగు పాములు విరివిగా దొరుకుతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములకు సైతం పూర్తిస్థాయిలో పనిచేసే విషపు గ్రంథులుంటాయి. ఏ వయసు నాగు పామును పట్టినా విషం సేకరించేందుకు అవకాశం ఉంటుంది.

పది నాగులను పడితేకానీ..తులం రాదు..

10 నాగు పాముల నుంచి తులం విషం సేకరిస్తారు. పాములు పట్టే వాళ్లు..నాగు తల పైభాగం, దానికి కిందనున్న భాగాన్ని చేతులతో గట్టిగా నొక్కుతూ పాము విషపు గ్రంథులను అదమటం ద్వారా కోరల్లోంచి విషాన్ని కక్కిస్తారు. వీళ్లకు ఎంతోకొంత ముట్టచెప్పి..దళారి ఆ విషాన్ని కొంటాడు. చాలామంది పాములోళ్లకు..ఆ విషాన్ని దళారి ఏం చేస్తాడు, ఎంతకు అమ్ముతాడు అనేది కూడా తెలియదు.

ఇలా టెస్ట్ చేసి కొంటారట

పాములోళ్లు సేకరించిన విషాన్ని రబ్బరు మూత గల చిన్న గాజు సీసాలో భద్రపరుస్తారు. దళారులు విషాన్ని కొనే సమయంలో దాని నాణ్యతను పరీక్షించి మరీ కొంటారట. దళారులు కోడిని తెచ్చి దానికి చిన్నపాటి గాయం చేస్తారట. పాములోళ్లు సేకరించిన విషాన్ని పిన్నీసు మొనతో గాయమైన కోడికి పూస్తారు. అది అరగంటలో మరణిస్తే నాణ్యమైనదిగా గుర్తిస్తారట. లేదంటే ఆ విషాన్ని కొనరట.

ఇంతకీ ఈ విషంతో ఏం చేస్తారు

పాము విషం మనిషి ప్రాణాల్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుందట. ఆశ్యర్యంగా ఉంది కదూ..గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ ఈ పాము విషాన్ని వినియోగిస్తారట. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందులో సైతం స్వల్పశాతం విషం ఉపయోగించే తయారు చేస్తారట.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news