‘చీపురు’ కట్టనా.. పుల్లనా? తెలంగాణను ఊడ్చేస్తుందా..?

-

‘చీపురు’ ఏం ఊడుస్తుందులే అని మొన్నటి వరకు అందరూ అనుకున్నారు. ఢిల్లీకే అది పరిమితమని భరోసాతో ఉన్నారు. కానీ.. పంజాబ్‌లో దిగ్గజపార్టీలను మట్టికరిపిస్తూ అనూహ్య విజయం సాధించడంతో ఇప్పుడు అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ‘చీపురు పుల్లలా’ ఆప్‌ను తీసేయడానికి వీళ్లేదని అనుకుంటున్నాయి. పంజాబ్‌లో సాధించిన విజయంతో ఆప్ ఇప్పుడు మంచి జోష్‌లో ఉంది. త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలపై అప్పుడే దృష్టి సారించింది. హర్యానాలోనూ పావులు కదుపుతోంది. ఈ రెండు రాష్ట్రాల తర్వాత ప్రధానంగా దక్షిణాదిలోని తెలంగాణపై కన్నుపెడుతామని కూడా ఆ పార్టీ నేతలు ఉద్ఘాటిస్తున్నారు. మరి తెలంగాణలో తెలంగాణలో ఆ పార్టీ విస్తరణకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి?

ఇప్పటికే షర్మిళ నాయకత్వంలోని కొత్త పార్టీ వచ్చేసింది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీ కొత్త జవసత్వాలు నింపుకున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క కోదండరాం పార్టీ మాత్రమే అటో ఇటో అన్నట్లుగా ఉంది. అధికారమే పరమావధిగా బీజేపీ రాజకీయాలు నడుపుతోంది. ఇటీవలె ఆ పార్టీలో తెలంగాణ ఇంటిపార్టీ విలీనమైంది. దాంతో దాని బలం మరింత పెరిగినట్లయింది. అధికారం పక్కన పెట్టి ప్రస్తుతమున్నరెండో స్థానాన్ని కాపాడుకునే పనిలో కాంగ్రెస్ ఉన్నది. ఈ పరిస్థితిలో ఆప్‌కు తెలంగాణలో స్థానమెక్కడ? ఆ పార్టీలో చేరేదెవరు? అన్నది పెద్ద ప్రశ్న.

అయితే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పట్ల విముఖత ఉండి తటస్థులుగా ఉన్న నేతలు, ఇతర నాయకులు ‘ఆప్’ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వారిని ఆకర్షించే పనిలో ఆ పార్టీ ఇప్పటికే ఉన్నది. పలువురు నాయకులతో ఆప్ పెద్దలు ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పాల్గొని.. నేడు నిరాదరణకు గురవుతున్న ‘మాజీ ఉద్యమకారులు’ ఆప్‌లో చేరేందుకు ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కలువరని, మంత్రులకు అపాయింట్‌మెంట్ లభించడం కూడా గగననమే అనే వ్య‌తిరేక టాక్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విపక్షాలు విజయవంతమయ్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. కిందిస్థాయిలోని టీఆర్‌ఎస్ నేతల ఆగడాలు శృతిమించుతున్నా పార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు కూడా కనిపించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కొత్త మునిసిపాలిటీల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ఏ పని కావాలన్నీ ఇంత కమీషన్ ఇవ్వాల్సిందేనన్న రీతిలో టీఆర్‌ఎస్ మునిసిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్న సంఘటనలు సోషల్ మీడియా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో నిర్వహించిన సర్వేలోనూ వెల్లడయిందని, ఈ మేరకు ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ఓ నివేదిక సమర్పించినట్లుగా బాహాటంగానే వెల్లడయింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కొంచెం గట్టిగా శ్రమిస్తే తమకే అధికారం దక్కుతుందని బీజేపీ, కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నాయి. ఇదే నమ్మకంతో ‘ఆప్’ కూడా తెలంగాణలో అడుగులు పెట్టి పార్టీని విస్తరించేందుకు వ్యూహాలు రెడీ చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఈ మూడు పార్టీల్లోని అసంతృప్త‌ నేతలను, నిరాద‌ర‌ణ‌కు గుర‌వుతున్న‌ ఉద్యమకారులను పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇత‌ర పార్టీలేమీ త‌క్కువ‌గా చూడాల్సిన ప‌ని లేదు. ఆప్ ఒక అడుగువేస్తే ఇవి రెండు అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ‌లోని ఈ రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఆప్ నిలదొక్కుకుని ఇతర పార్టీలను తుడిచివేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news