ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ రోజు టీడీపీ సర్కారు చేసుకున్న కొన్ని ఒప్పందాలను వద్దనుకుని రివైజ్డ్ వెర్షన్ కావాలని జగన్ ప్రభుత్వం పట్టుబట్టిన మాట వాస్తవమే ! అదేవిధంగా బొగ్గు కొరత నివారణకు చర్యలు చేపట్టని కారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంబంధిత కేంద్రాల సామర్థ్యానికి అనుగుణంగా లేని మాట కూడా వాస్తవమే ! అయితే వీటిని అధిగమించేందుకు జగన్ సర్కారు మరింత కృషి చేస్తే, తక్షణ సాయం కింద డిస్కంలకు నిధులు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకానీ టీడీపీ చెప్పిన విధంగా రాష్ట్రమేమీ శ్రీలంక కాదు సింగపూర్ అంతకన్నా కానే కాదు.
ఎవరు గొప్ప అన్న వాదమే సిసలు చిక్కు.. అసలు సమస్య కూడా ! ఓ విధంగా ప్రమాదం కూడా ! ఈ నేపథ్యంలో పోలికలు మన జీవితాలను ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలనూ ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుందో కూడా తెలుసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుకుని అవశేషాంధ్ర వరకూ సింగపూర్ కలలు అన్నవి బాబును వెన్నాడుతూనే ఉన్నాయని ఆ రోజు కమ్యూనిస్టులు ఇప్పుడు వైసీపీ నాయకులు అంటున్నారు. అంటే ఓ విధంగా కమ్యూనిస్టుల గొంతుకే కార్పొరేట్ పార్టీగా పేరొందిన వైసీపీ వినిపిస్తోంది. ఇందులో ప్రత్యేకత ఏముందని..? అయినా సింగపూర్ అయినా శ్రీలంక అయినా ఏదయినా సంక్షభాలను అధిగమించేందుకు పాటు పడాల్సిందే ! అందుకు తగ్గ శ్రమ చేయాల్సిందే ! ఇవేవీ కాకుండా పాలన సాగించడం అన్నది జరగని పని ! ఈ దేశం అయినా ఈ విదేశాంగ విధానం అయినా ఏ మైత్రి పూర్వక ప్రతిపాదన అయినా ఓ సమూహాన్ని విపరీతంగా ప్రభావితం చేసి, వారిలో ముఖ్యంగా చెప్పాలంటే వారి జీవన ప్రమాణాల మెరుగుదలలో కీలక మార్పు తెస్తేనే ఆ మోడల్ నో లేదా ఆ సంస్కృతినో లేదా ఆ ప్రామాణిక రూపాన్నో పాలకులు అనుసరించాలి.
ఇక్కడే ఆకాశ హర్మ్యాల నిర్మాణం వరకూ చంద్రబాబు సింగపూర్ కలలు కన్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. కానీ ఆ రోజు హైద్రాబాద్ లో కూడా ఆయన ఇవే కలలు కన్నారు. మరి ! ఆకాశ హర్మ్యాల నిర్మాణం అన్నది ఇవాళ్టికీ అక్కడ కొనసాగుతూనే ఉంది. ఆయన భూమిని సంపద సృష్టి కేంద్రంగానే చూస్తున్నారు. కానీ జగన్ ఆ విధంగా చూడడం లేదు అన్న వాదన కూడా ఉంది. ఆ విధంగా జగన్ కొంత అభివృద్ధి పరంగా వెనుకబాటును చవి చూస్తున్నారు. కానీ టీడీపీ ఆరోపిస్తున్న రాష్ట్రం శ్రీలంక అవుతుందా అన్నది ఓ సత్యదూరం. అంటే అది కేవలం ఓ రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే అంటున్న మాట. అంతేకాని మరీ అంత దీనావస్థలో రాష్ట్రం ఉంటే కేంద్రం ఎందుకు ? ఈ ఫెడరల్ వ్యవస్థ ఎందుకు ?
వ్యవసాయమే తెలియని దేశం సింగపూర్.. టూరిస్టులే ఆధారం అయి బతికే దేశం శ్రీలంక.. ఆ మాటకు వస్తే టూరిజం హబ్ సింగపూర్ కూడా ! మరి ఆ రెండు దేశాలకు సంబంధించి మనోళ్లకు కొన్ని పోలికలు వెతికే పని పడింది. ఆ విధంగా చంద్రబాబు ఆ రోజు సింగపూర్ కలలు కన్నారని అవి తప్పని వైసీపీ అంటోంది. ఇదే సమయాన పాలన సవ్యంగా సాగించలేని జగన్ మోహన్ రెడ్డి శ్రీలంక మోడల్ ను అనుసరిస్తున్నారని ఇది తప్పని టీడీపీ అంటోంది. ఆ విధంగా విషయ పరంగా రెండు వాదనలు వస్తున్నాయి.