తాజాగా కొడాలి నాని స్థానంలో వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు.. అనకాపల్లి బాబు గుడివాడ, గుంటూరు బాబు సారీ పల్నాటి బాబు అంబటి, అదేవిధంగా మరో బాబు కొట్టు. (పూర్తి పేరు కొట్టు సత్యనారాయణ, ఊరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి, టీపీ గూడెం ఎమ్మెల్యే) వీళ్ల ముగ్గురి పనీ ఏంటంటే తిట్టడం. పవన్ ను టార్గెట్ గా చేసుకుని తిట్టడం.. అంతకుమించి వీళ్లు ఏమీ చేయరు. చేయలేరు అనలేం కానీ చేయరు అని చెప్పడం భావ్యం. ఎందుకని ఈ ముగ్గురూ అధినేత దగ్గర ఇంత మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయాస పడుతున్నారో మరి ! తమకు అస్సలు అర్థం కావడం లేదని, ప్రజా సమస్యల కన్నా పవన్ కల్యాణ్ ను తిట్టడమే గొప్ప అని భావిస్తే తాము ఇకపై వాగ్ధాటి పెంచడం ఖాయమని జనసేనాని ప్రతినిధులు చెబుతున్నారు.ఆ వివరం ఈ కథనంలో
ఓ విధంగా ఆంధ్రా సర్కారుకు, తెలంగాణ సర్కారుకు చాలా తేడా ఉంది. అక్కడ కొన్ని తరగతులు గతంలో కొందరికి నిర్వహించారు. వీటిని విషయ నిపుణులు మాత్రమే నిర్వహించి, కొందరు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను బాగా తీర్చిదిద్దారు. మన దగ్గర మాత్రం కనీస స్థాయిలో కూడా ప్రాజెక్టులకు సంబంధించిన పరిభాష తెలియకపోయినా మంత్రులుగా చెలామణీ అయిపోవడం అన్నది చాలా సులువుగా జరుగుతున్న ప్రక్రియ. ఆ విధంగా మన దగ్గర ఏ విషయమూ మరియూ విషయ సంబంధ పరిజ్ఞానమూ లేకపోయినా మంత్రులకు 4 తిట్లు తిట్టడం వస్తే చాలు. వాళ్లంతట వాళ్లు తమ పరువు తీసుకోవడం తెలుసుకుంటే చాలు. ఇక ఏపీ క్యాబినెట్ లో తిరుగులేదు. ఓ ఎత్తిపోతల పథకాన్ని కానీ లేదా ఓ రెండు నదులను కలిపే పద్ధతి కానీ లేదా అంతర్వాహినీ గా ప్రవహించే నదుల గురించి కానీ ఏమీ తెలియకుండా… నిల్వ సామర్థ్యం అంటే ఏంటో కూడా తెలియకుండా, ప్రవాహ ధర్మాలు కూడా తెలియకుండా ఏపీలో మంత్రులు కావొచ్చు. కానీ ఇదేమని అడిగితే కోపాలు వస్తాయి. ఆ మాటకు వస్తే ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజర్ దేన్ నిల్ నాలెడ్జ్ అన్న సూక్తికి దగ్గరగా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు ఉంటాయి. అయినా వారిని మీరు ఏమీ అడగవద్దండి.. ప్లీజ్ !
మాటలు కోటలు దాటితే యుద్ధాలు వస్తాయి. మాటలు కోటలు దాటి వచ్చాక సంయమనం కోల్పోతే ఇంకా పెను విధ్వంసాలు జరుగుతాయి. మాట జాగ్రత్త అని పెద్దలు అంటారు. కానీ ఎందుకనో అంబటి మాత్రం మాటను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. తనదైన వ్యాఖ్యలు చేస్తూ వ్యంగ్యాన్ని వాటికి జోడిస్తూ మీడియాకు మంచి స్టఫ్ అయితే అందిస్తున్నారు. వీటి వల్ల ఆయనకు ఏంటి ప్రయోజనం. గతంలో ఇదే జలవనరుల శాఖను నిర్వహించిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏమయ్యారు. గతంలో ఇదే జలవనరుల శాఖ ను నిర్వహించిన దేవినేని ఉమతోనో లేదా మరో సీనియర్ లీడర్ (తెలంగాణకు చెందిన లీడర్ ) పొన్నాల లక్ష్మయ్య తోనో ఓ సారి మాట్లాడి చూడవచ్చు కదా ! కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ పరువు ఎలా తీసుకుంటున్నారని ?